
మిగతా పార్టీలకన్నా ముందే అభ్యర్థుల ఖరారు
రెండు దశల్లో ప్రచారానికి కార్యాచరణ
పోలింగ్ బూత్ స్థాయిలో ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘ఎలక్షన్ యాక్షన్ ప్లాన్’ రెడీకావడంతో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో కార్యక్షేత్రంలోకి దిగుతోంది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ల కంటే ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. ఎన్నికల సన్నద్ధతలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అన్నిస్థాయిల్లోని నాయకులు, కార్యకర్తల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
పోలింగ్ బూత్ స్థాయి నుంచీ ›ప్రజల మద్దతు కూడగట్టేలా జాతీయనాయకత్వం పకడ్బందీ కార్యాచరణను రూపొందించింది. ఈ క్రమంలో భారీ ఎత్తున ‘ఓటర్ మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ ద్వారా ఇంటింటి ప్రచారం చేపట్టాలని.. ప్రతీ ఓటర్‌ను కలసి పార్టీ అభ్యర్దికి ఓటేసేలా ఒప్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో శాసనసభ నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనాలు, ఓటర్లతో భేటీలు చేపట్టాలని ఆదేశించింది.
రెండు దశల్లో ప్రచారానికి ప్రణాళిక
రాష్ట్రంలో రెండు దశల్లో ప్రచారంతో ఎలక్షన్ మేనేజ్‌మెంట్ వైపు బీజేపీ అడుగులు వేస్తోంది. తొలిదశలో నామినేషన్ల పర్వం ముగిసే వరకు (ఏప్రిల్ 25దాకా) రాష్ట్ర ముఖ్యనేతలు మొదలు సామాన్య కార్యకర్త వరకు అనుసరించాల్సిన రూట్‌మ్యాప్‌ను ఆదివారమే ప్రకటించింది. రెండోదశలో అంటే ఏప్రిల్ 25 నుంచి మే 13న పోలింగ్ ముగిసేదాకా పోలింగ్ బూత్ స్థాయిలో చేపట్టాల్సిన ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ప్రణాళిక రూపొందించింది.
రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించి.. అన్నిచోట్లా పక్కా ప్లానింగ్‌తో ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఈ నెలాఖరులోగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌కు ఇంకా నెలన్నరకుపైగా సమయం ఉండటంతో భారీ బహిరంగ సభల కంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న సభలు నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
పోలింగ్ బూత్ స్థాయి నుంచీ..
బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాల దృష్టి అంతా పోలింగ్ బూత్ స్థాయి నుంచీ పార్టీ బలోపేతంతోపాటు, పార్టీ కేడర్ కార్యకలాపాలపైనే పెట్టాయి. పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ బూత్ స్థాయిలో ఎక్కువ ఓట్లు సాధించేలా చేయడాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఈ క్రమంలో టిఫిన్ బైఠక్‌లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యాచరణతో నేతలు ముందుకు వెళ్తున్నారు. దీనికితోడు యువత, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రైతులతో తరచూ సమావేశాలు నిర్వహించడం ద్వారా వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్లేలా ‘హర్ ఘర్ తీన్ బార్’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.
జాతీయ, రాష్ట్రస్థాయి నేతల ప్రచారంతో..
రాష్ట్రంలో మిగతా పార్టీల కంటే ముందే తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయనుండటం, స్వయంగా ప్రధాని మోదీ, ఇతర జాతీయ నేతలు ప్రచార సభల్లో పాల్గొననుండటం బీజేపీకి కలసి వస్తుందని ఆ పార్టీ ముఖ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో మరింతగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.