
సంజయ్‌ను సన్మానిస్తున్న బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు
సాక్షి, కరీంనగర్: ‘‘కరీంనగర్ ప్రమాదంలో పడింది. భూకబ్జాదారులు, చీటర్లు, అవినీతి కేసులున్న వారు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పక్షాన పోటీచేస్తున్నారు. నేను ధర్మం కోసం, ప్రజా సమస్యలపై పోరాడుతున్నాను. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ ప్రజలను కోరారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో వేర్వేరుగా నిర్వహించిన బ్రాహ్మణ, రెడ్డి, ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని మాట్లాడారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ నియోజకవర్గం గురించి ఏమీ తెలియదని, తెలిసిందల్లా భూకబ్జాలు చేయడమేనని ఆరోపించారు.
ఆయనపై 27 కేసులున్నయని, అవన్నీ కబ్జాలు, ఫోర్జరీ కేసులేనని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పైనా అవినీతి, అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయని చెప్పారు. వారు ఎప్పుడూ ప్రజల కోసం కొట్లాడలేదన్నారు. అదే తనపై 74 కేసులు ఉన్నాయని.. అవన్నీ పేదలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం కొట్లాడితే సీఎం కేసీఆర్ పెట్టించినవని పేర్కొన్నారు.
భారీగా నిధులు తీసుకొచ్చా..
ఎంపీగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి దా దాపు రూ.9 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా నని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్–జగిత్యా ల, కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి నిర్మా ణానికి, స్మార్ట్ సిటీకి నిధులు తెచ్చానని పేర్కొన్నా రు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వ్యాపారులను బెదిరించి వసూళ్లు చేయడం తప్ప మరేమీ చేయలేదని ఆరోపించారు. వారు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, మోసపోకుండా తనకు ఓటేసి ప్రశ్నించే గొంతుకను కాపాడుకోవాలని ప్రజలను కోరారు.