‘14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే ప్రయత్నం చేయలేదు’

AP New Districts: Vallabhaneni Vamsi Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ అభిమానులుగా తాము, టీడీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎంతో ఆనందపడుతున్నారని తెలిపారు. జిల్లాల అంశంపై చంద్రబాబు కనీసం నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. జిల్లాల పేర్లను టీడీపీ సోషల్ మీడియా వేదికగా రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు.

పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని వంశీ కొనియాడారు. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన రోజునే చంద్రబాబు వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించామని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు.. మీకు రాజకీయాలు తెలియవు, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాదు, ఏం చేయాలో నాకు తెలుసు అంటూ తమతో వాదించారని ప్రస్తావించారు. ఇప్పుడు 26 జిల్లాల విషయంలో టీడీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

సోషల్ మీడియా వేదికగా జిల్లాల పెంపు అంశంపై దుష్ప్రచారం చేస్తున్నారని వల్లభనేని వంశీ దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీడియాలో డబ్బులు ఇచ్చి పోస్టింగ్‌లు పెట్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జిల్లాల పేర్ల గురించి టీడీపీ బోగస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, అధికారులు, మంత్రివర్గం కలిసి జిల్లాల పెంపును ప్రకటించారని, ప్రజాభీష్టం మేరకు ఆయా జిల్లాలకు పేర్లు పెడుతున్నారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top