ఆగిన మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు? | AP Election Commission May Conduct Stopped Municipalities Election Soon | Sakshi
Sakshi News home page

ఆగిన మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు?

Oct 23 2021 5:00 AM | Updated on Oct 23 2021 5:00 AM

AP Election Commission May Conduct Stopped Municipalities Election Soon - Sakshi

సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మునిసిపాలిటీలలో వచ్చే నెల 7 లేదా 8 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాది మార్చిలో మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించిన సమయంలో వివిధ కారణాలతో నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లతో పాటు 32 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

అప్పట్లో ఎన్నికలు ఆగిన వాటిల్లో.. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మునిసిపాలిటీ, బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు), ఆకివీడు(పశ్చిమగోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి(కృష్ణా), దాచేపల్లి, గురజాల(గుంటూరు), దర్శి(ప్రకాశం), బేతంచెర్ల(కర్నూలు), కమలాపురం, రాజంపేట(వైఎస్సార్‌), పెనుకొండ(అనంతపురం) మునిసిపాలిటీలలో తాజాగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

వీటికి సంబంధించి సోమవారం, లేదంటే మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఆయా చోట్ల.. నోటిఫికేషన్‌ జారీ చేసిన మరుసటి రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టి.. నెలాఖరులోగానే ఆ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో మునిసిపల్‌ ఎన్నికలు జరిగిన ఏడు నగర పాలక సంస్థల పరిధిలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన 12 డివిజన్లకు, మరో 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 14 వార్డులకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ సందర్భంగానే ఎన్నికలు నిర్వహించనుంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని తాజాగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. అలాగే శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీరాజ్, మునిసిపల్‌ శాఖల కమిషనర్లు కూడా టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.  

మునిసిపల్‌ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత..  
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 71 గ్రామాల్లో సర్పంచ్, 176 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. అన్నింటికీ కలిపి ఒకే రోజు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. మునిసిపల్‌ ఎన్నికలు జరిగే తేదీకి ఒక్క రోజు ముందు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, ఆ తర్వాత రోజు మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించి.. ఆ మరుసటి రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచి చనిపోయిన కారంపూడి(గుంటూరు), లింగాల(వైఎస్సార్‌), కొలిమిగుండ్ల(కర్నూలు) స్థానాలతో పాటు, పోలింగ్‌ జరగక ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోయిన కారణంగా ఎన్నిక నిలిచిన మరో 11 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement