మొన్ననే విమర్శలు.. మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ చేసిన కొత్త సీఎం | Amid row over using caste surname Satheesan did it again | Sakshi
Sakshi News home page

మొన్ననే విమర్శలు.. మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ చేసిన కొత్త సీఎం

May 21 2026 5:55 PM | Updated on May 21 2026 7:40 PM

Amid row over using caste surname Satheesan did it again

తిరువనంతపురం: కేరళం కొత్త సీఎం సతీశన్‌ విషయంలో మళ్లీ ‘‘కులం’’ పేరు మీద వివాదం రాజుకుంది. సతీశన్‌ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో తన తండ్రి పేరు ‘‘దామోదర మీనన్‌’’ను మళ్లీ ప్రస్తావించారు. తన పూర్తి పేరు “వడస్సేరి దామోదర మీనన్ సతీశన్” అని చెప్పారు.

ఈ వివాదం సీఎం సతీశన్ “మీనన్” అనే కులాన్ని తన పేరు ముందు ఇంటిపేరులా వాడటంతో మొదలైన విషయం తెలిసిందే. మే 18న కేరళం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ఆయన తన పూర్తి పేరు “వడస్సేరి దామోదర మీనన్ సతీశన్” అని చెప్పారు. దీనిపై సొంత కాంగ్రెస్‌ పార్టీలో కూడా కొందరు నేతలు అభ్యంతరాలు తెలిపారు.

సతీశన్‌ ఇంటి పేరును వాడడం పట్ల కొందరి వాదన ఇలా ఉంది.. కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు దూరంగా ఉండాలని చెబుతుంది. అలాంటి పార్టీకి చెందిన నేత కులాన్ని సూచించే పేరును వాడటం సరైంది కాదని అన్నారు. “మీనన్”ను కేరళంలో ఒక ఉన్నత కుల గుర్తింపుగా భావిస్తారు. అందుకే ఇది సమానత్వ భావనకు విరుద్ధమని విమర్శించారు.

కాంగ్రెస్ నేత జింటో జాన్.. తాను కూడా తన వర్గ గుర్తింపును పేరులో పెట్టుకోనని సోషల్ మీడియాలో తెలిపారు. మరో నేత వీఆర్ అనూప్.. అంబేద్కర్ పుస్తకాలను చదవాలని సతీశన్‌కు సూచించారు. దీనికి సతీశన్ సమాధానం కూడా ఇచ్చారు. “అది నా తండ్రి పేరు” అని చెప్పారు. తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్తి పేరు చెప్పానన్నారు. పాస్‌పోర్ట్‌లో కూడా అదే పేరు ఉందని వివరించారు. ఇందులో కుల గర్వం లేదని, తల్లిదండ్రుల జ్ఞాపకం మాత్రమే ఉందన్నారు.

మరో వివాదం “వందే మాతరం” పూర్తి రూపం పాడటంపై వచ్చింది. సీపీఎం అభిప్రాయం ప్రకారం.. వందే మాతరం పూర్తి పాటలో కొన్ని భాగాలు ఒక్క మత భావజాలాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. అందుకే గతంలో కొన్ని పంక్తులను అధికారికంగా తొలగించారు. కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో పూర్తి రూపం పాడటం బహుళ సమాజ భావనకు విరుద్ధమని సీపీఎం విమర్శించింది.

కేరళం శాసనసభ తొలి సమావేశం షురూ 
ఇదిలా ఉండగా, 16వ కేరళం శాసనసభ తొలి సమావేశం గురువారం తిరువనంతపురంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైంది. ప్రో-టెమ్ స్పీకర్ జీ సుధాకరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే వీ ఈ అబ్దుల్ గఫూర్ తొలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి సతీశన్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల మంత్రివర్గం మే 18న ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసింది.

కొత్త సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మే 22న స్పీకర్ ఎన్నిక జరగనుంది. వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కేరళం అసెంబ్లీలో తొలిసారి 3 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ స్పీకర్ ఎన్నికలో తన అభ్యర్థిని నిలబెడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

గోపకుమార్ బుధవారం అసెంబ్లీ కార్యదర్శి షాజీ సీ బేబీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీవ్ చంద్రశేఖర్, వీ మురళీధరన్ ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పీకర్ పదవికి సీనియర్ నేత తిరువంచూర్ రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది.

ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ముందు.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజీవ్ చంద్రశేఖర్, వీ మురళీధరన్, బీబీ గోపకుమార్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లారు. కాగా, 16వ కేరళం శాసనసభకు ఎన్నికైన మొత్తం 140 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రో-టెమ్ స్పీకర్ జీ సుధాకరన్ ప్రమాణం చేయించారు. కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 140 స్థానాల్లో 102 గెలుచుకుంది. లెఫ్ట్ డెమోటిక్ ఫ్రంట్ 35 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 3 స్థానాలు సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement