Allu Arjun Controversy: రాజకీయ రగడ | Allu Arjun Episode Create Wild Fire In Telangana Politics, Check More Details Inside | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ కాంట్రవర్సీ: రాజుకున్న వైల్డ్‌ ఫైర్‌.. రాజకీయ రగడ

Dec 23 2024 6:59 AM | Updated on Dec 23 2024 10:47 AM

Allu Arjun Episode Create Wild Fire in Telangana Politics
  • సీఎంకు అల్లు అర్జున్‌ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్‌
  • పశ్చాత్తాపం ప్రకటిస్తారనుకున్నాం : కాంగ్రెస్‌ నేతలు
  • సినీ పరిశ్రమను టార్గెట్‌ చేస్తారా?: బీఆర్‌ఎస్‌
  • తెలుగు సినీ పరిశ్రమపై సీఎం పగ : బీజేపీ

సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించడం, దానికి కొనసాగింపుగా నటుడు అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహణ ‘రాజకీయ చిచ్చు’ రాజేసింది. నటుడి ఇంటిపై ఓయూ జేఏసీ ఆదివారం రాళ్ల దాడికి దిగగా.. ఘటనను ఖండిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో అల్లు అర్జున్‌ తీరును అధికార కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎవరేమన్నారంటే..

సినీనటుడు అల్లు అర్జున్‌ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తన ఇమేజ్‌ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్‌ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్‌ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్‌ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. 

.. అల్లు అర్జున్‌కు ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు, ఎక్స్‌ట్రా షోలు రద్దు చేస్తున్నామని.. టికెట్‌ ధరల పెంపునకు అను మతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అందులో భాగంగానే చిత్రపురి కాలనీలో జూనియర్, పేద ఆరి్టస్టులకు ప్లాట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. 

అల్లు అర్జున్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఎంపీ కిరణ్, ఎమ్మెల్సీ వెంకట్‌

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన తర్వాత.. సినీ నటుడు అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెడుతున్నారంటే సంధ్య థియేటర్‌ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారేమోనని అనుకున్నామని కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్‌ చెప్పారు. కానీ ఆయన రియల్‌ హీరోలా కాకుండా.. రీల్‌ హీరోలా వ్యవహరించారని విమర్శించారు. అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌పై ఎంపీ కిరణ్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. అర్జున్‌ ఏదో స్క్రిప్టు తీసుకొచ్చి చదివినట్టు మాట్లాడారన్నారు. అసలాయనేం చెబుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ అల్లు అర్జున్‌ ఆత్మ పరిశీలన చేసుకుని.. తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రేవతి చనిపోయిన మర్నాడు.. అల్లు అర్జున్‌ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆరోపించారు.  

వారిలో పశ్చాత్తాపం కనిపించడం లేదు 
సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు అల్లు అర్జున్‌ వ్యవహారశైలి దారుణంగా ఉందని, ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలను తప్పుపట్టేలా మాత్రమే ఆయన తీరు ఉందని, రేవతి కుటుంబంపై కనీస సానుభూతి కూడా ఆయన చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్‌ అంటున్నారని, మరి రేవతి కుమారుడు శ్రీతేజ్‌ ప్రాణం ఐసీయూలో ఉలుకూ పలుకూ లేకుండా పడిఉన్న విషయం అరవింద్‌కు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ కారణంగా జరిగిన తప్పును సమరి్థంచుకోకుండా సరిదిద్దుకోవాల ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎలీ్పలో ఆయ న నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మానవత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అల్లు అర్జున్‌ ఆరోపించడాన్ని ఆయన విమర్శించారు.

ఇదీ చదవండి: 'స్టాప్‌ చీప్‌ పాలిటిక్స్‌ ఆన్‌ అల్లు అర్జున్‌'

సినీ పరిశ్రమను టార్గెట్‌ చేస్తారా? : బీఆర్‌ఎస్‌ నేత శ్రవణ్‌  
సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సమస్యలను వదిలేసి.. సినిమా పరిశ్రమ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వారు ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసా అందక, రుణమాఫీ కాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించక, గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో.. వాటిపై చర్చ జరపకుండా అసెంబ్లీలో సినీ నటుడు అల్లు అర్జున్‌ను తిట్టేందుకు గంటల కొద్దీ సమయం కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. దేవాల యం లాంటి చట్టసభలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యక్తిగత కక్షతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

తెలుగు సినీ పరిశ్రమపై సీఎం పగ : బండి సంజయ్‌ 
సాక్షి, హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌: తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సంధ్య థియేటర్‌ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన శ్రీతేజ్‌ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులతో పక్కా ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వం సినిమా పరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు మృత్యువాత పడుతుంటే ఎన్నడైనా బాధ్యత వహించారా? అని నిలదీశారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆదివారం రాత్రి సంజయ్‌ పరామర్శించారు. అనంతరం బాలుని తండ్రితో కొద్దిసేపు మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బండి వెంట బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తదితరులు ఉన్నారు.   

పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలుతీస్తాం 
పంజాగుట్ట (హైదరాబాద్‌): సినీ నటుడు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి స స్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఏదైనా పశువు చనిపోయినా ఏం జరిగిందని ఆరా తీస్తాం. తన సినిమా చూసేందుకు వచ్చి, తొక్కిసలాటలో మహిళ చనిపోయి, పసిపిల్లాడు ప్రాణాపాయస్థితిలో ఉంటే పరామర్శించకుండా వెళ్లిపోయిన అల్లు అర్జున్‌కు మానవత్వం లేదు. ఆయనలో సక్సెస్‌ మీట్స్‌కు వెళ్ల్లలేకపోతున్నాననే ఆవేదనే తప్ప మనుషులు చనిపోయారన్న బాధ ఏ మాత్రం కనిపించడం లేదు’’అని ఓ ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవిస్తూ మాట్లాడాలన్నారు. తొక్కిసలాటతో ఎవరికీ సంబంధం లేదని, అది ప్రమాదమేనని అల్లు అర్జున్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు, నాయకులు పోలీసులపై అనుచితంగా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయిందని.. అలా మాట్లాడితే తోలు తీస్తామని వ్యాఖ్యానించారు. 

విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారికం: డీజీపీ ఆఫీసు 
డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్‌మీట్‌ పెట్టారని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement