బెంగాల్‌లో సీఎం మమతకు షాక్.. బీజేపీతో టచ్‌లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!

38 TMC MLAs In Contact With The BJP Actor Mithun Chakraborty - Sakshi

కోల్‌కతా: నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వీరిలో 21 మంది నేరుగా తనతోనే మాట్లాడుతున్నారని చెప్పారు. టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత ఆ పార్టీలో తుఫాన్‌ చెలరేగిందని, ఇదే బిగ్ బ్రేకింగ్ అన్నారు. ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. దీంతో మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు బెంగాల్‍లో కలకలం రేపుతున్నాయి.

బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్‌ కుంభకోణం కేసులో పార్థ చటర్జీ అరెస్టుపై మాట్లాడుతూ.. ఆయన తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మిథున్ పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఎవరూ ఆయన్ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఇది రూ.2000కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపించారు.

అలాగే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీనా? అనే అంశంపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్‌స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌లు ముస్లింలే అని చెప్పారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఆదరించడం వల్లే తను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ కూడా వాళ్ల సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తున్నట్లు వివరించారు. ఒకవేళ బీజేపీ వాళ్లను ద్వేషిస్తే ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.

గతేడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు మిథున్ చక్రవర్తి. మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతుందని అప్పుడు వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల్లో టీఎంసీ భారీ మెజార్టీతో గెలిచింది. బీజేపీ 70 పైచిలుకు స్థానాలతో సరిపెట్టుకుంది.
చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top