సప్తగిరికాలనీ(కరీంనగర్): నేటి వేగవంతమైన ప్రపంచంలో కేవలం డిగ్రీలు ఉండడం కంటే చేతిలో నైపుణ్యం ఉండడమే అసలైన విజయం. పదోతరగతి పూర్తి కాగానే విద్యార్థుల ముందున్న అత్యుత్తమ మార్గం పాలిటెక్నిక్ అని పలువురు విద్యావిశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక కోర్సు మాత్రమే కాదు.. తక్కువ కాలంలోనే ఒక ఇంజనీర్‌గా విద్యార్థులను తీర్చిదిద్దే అద్భుతమైన వేదిక. డిగ్రీలు దాహాన్ని తీర్చవు.. నైపుణ్యం మాత్రమే ఆకలిని తీరుస్తుంది అనే నినాదంతో సాంకేతిక విద్య వైపు అడుగులు వేయడం విద్యార్థుల తక్షణ అవసరమంటున్నారు. రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ తదితర వాటిపై కూడా అవగాహన కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం సాక్షి ప్రత్యేక కథనం.
● తక్కువ వయసులోనే స్థిరత్వం
18–19 ఏళ్లకే టెక్నికల్ డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగంలో చేరే అవకాశం పాలిటెక్నిక్ కల్పిస్తుంది.
● ప్రాక్టికల్ నాలెడ్జ్
పుస్తకాల్లోని పాఠాల కంటే ల్యాబుల్లో ప్రయోగాత్మక విద్యకు ఇక్కడ పెద్దపీట వేస్తారు.
● ఇంజనీరింగ్ సులభం
పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరొచ్చు.
● ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు
రైల్వేలు, పీఎస్‌యూ, రక్షణ రంగాల్లో డిప్లొమా ట్రెయినీ హోదాలో అత్యుత్తమ జీతంతో కొలువులు సాధించొచ్చు.
● స్లాట్ బుకింగ్..
కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి తొలుత స్లాట్ బుకింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. మీకు దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్ తేదీ, సమయాన్ని ఎంచుకొని బుక్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయ్యాక వచ్చే రసీదును తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి.
● ఫీజు వివరాలు..
ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
● సర్టిఫికెట్లు..
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఒరిజినల్ పత్రాలతోపాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి. పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఎస్సెస్సీ మార్కుల మెమో, టీసీ, 4వతరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం(బీసీ, ఎస్సీ, ఎస్టీ), ఆదాయ ధ్రువీకరణ పత్రం(01.01.2026 తర్వాత పొంది ఉండాలి).
● వెబ్ ఆప్షన్..
విద్యార్థులు కోరుకున్న సీటు రావాలంటే ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆప్షన్లు పరిమితంగా కాకుండా ఎక్కువ సంఖ్యలో కాలేజీలను ఎంచుకోవాలి. నచ్చిన బ్రాంచి, కాలేజీని మొదటి వరుసలో ఉంచాలి. ఆప్షన్లు సేవ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి.
● ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు
● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కరీంనగర్.
● ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం, రాజన్న సిరిసిల్ల.
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కోరుట్ల.
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హుస్నాబాద్.
● జ్యోతిష్మతి పాలిటెక్నిక్ కళాశాల, కరీంనగర్
● వాగేశ్వరి పాలిటెక్నిక్ కళాశాల, కరీంనగర్
● ట్రినిటీ పాలిటెక్నిక్ కళాశాల, పెద్దపల్లి
● మదర్ థెరిసా పాలిటెక్నిక్ కళాశాల, పెద్దపల్లి
● ఉమ్మడి జిల్లాలో హెల్ప్‌లైన్ కేంద్రాలు
● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కరీంనగర్.
● ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం, రాజన్న సిరిసిల్ల.
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కోరుట్ల.
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హుస్నాబాద్.
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాజగోపాల్పేట్, సిద్దిపేట.
● ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, చిన్నకోడూరు, సిద్దిపేట.
● పాలిసెట్ 2026 మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్
● స్లాట్ బుకింగ్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ మే 27 నుంచి మే 31 వరకు.
● స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన మే 29 నుంచి జూన్ 1 వరకు.
● సర్టిఫికెట్ ధ్రువీకరణ అనంతరం ఎంపికలను వినియోగించుకోవడం మే 29 నుంచి జూన్ 3 వరకు.
● ఎంపికలను స్తంభింపజేయడం జూన్ 3.
● సీట్ల కేటాయింపు జూన్ 6 లేదా అంతకుముందు.
● వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, స్వీయ నివేదన జూన్ 6 నుంచి జూన్ 9 వరకు.
● కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ జూన్ 8 నుంచి జూన్ 9 వరకు.
● విద్యాసంవత్సరం ప్రారంభం జూన్ 9 నుంచి.
● ఓరియంటేషన్ జూన్ 8 నుంచి జూన్ 10 వరకు.
రేపటి నుంచి కౌన్సెలింగ్
ఉమ్మడి జిల్లాలో 6 హెల్ప్‌లైన్ కేంద్రాలు


