పుష్కర స్నానం.. పుణ్యక్షేత్రాల దర్శనం | - | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానం.. పుణ్యక్షేత్రాల దర్శనం

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

ఆధ్యాత్మిక ఆనవాళ్లు

మంథని: త్రివేణి సంగమ క్షేత్రంలో గురువారం నుంచి 12 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం విలసిల్లనుంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణాహిత నదులు కలుస్తుండంతో ఇక్కడ అంతర్‌వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదికి గతేడాది ఆదిపుష్కరాలు నిర్వహించారు. నేటినుంచి జరిగే అంత్యపుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈమేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరస్నానం తర్వాత కాళేశ్వరముక్తీశ్వర స్వామి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకళలాడనున్నాయి.

మంత్రి దంపతులతో తొలుత అంత్యపుష్కర స్నానం

కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.43 గంటలకు అంత్యపుష్కర స్నానాలకు పండితులు ముహూర్తం నిర్ణయించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యార్‌ దంపతులతో అంత్యపుష్కరాలను వేదపండితుల ప్రత్యేక పూజల నడుమ ప్రారంభించనున్నారు. గవర్నర్‌ శివప్రతాప్‌ సుక్లా, కంచి ఫిఠాధిపతులు శ్రీవిజయోద్రసరస్వతీతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరుకానున్నారు.

టెంపుల్‌ టౌన్‌గా మంత్రపురి

ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లు. వేయి సంవత్సరాలకుపైగా మహోన్నత చరిత్ర కలిగిన మంథని ఆలయాలకు నిలయమై టెంపుల్‌ టౌన్‌గా ప్రసిద్ధి కెక్కింది. ఉత్తర తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా అష్టభుజ, సిద్ధి, బుద్ధి సహిత వినాయకుని గుడిఉత్తర ముఖంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఏకై క పశ్చిమ ముఖశివలింగం ఇక్కడే దర్శనమిస్తుది. 13 హనుమాన్‌ దేవాలయాలతో పాటు మంథనిలో అన్నిదేవతల దేవాలయాలు పురాణకాలంలోనే నిర్మించారు. నూతనంగా అయ్యప్ప దేవాలయం, అందులో సరస్వతీ, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలనూ నిర్మించారు. గోదావరి తీరంలో వెలసిన గౌతమేశ్వర దేవాలయం నుంచి సోమసూత్రం ప్రకారం ప్రమిదగణాలు.. పట్టణ ప్రారంభంలో కాలభైరవుడితో మరో దేవతామూర్తిని ఏర్పాటు చేశారు. సూర్య, చంద్రలతోపాటు పది చేతులతో కూడిన భగీరథ అమ్మవారు, కాసికాదేవి.. ఇలా పట్టణం నలుదిక్కులా వాస్తుతో నిర్మిత మైంది. వీటితోపాటు కనకాపరమేశ్వరి, షిరిడీసాయి, అయ్యప్ప, రేణుకా ఎల్లమ్మ, భలవీర హనుమాన్‌, నాగదేవత, కాళీకాదేవి, గంగాదేవి, బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారని అనడానికి పట్టణంలోని ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.

ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర– ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకేపీఠంపై రెండు శివలింగాలు(శివుడు, యముడు) కొలువై ఉన్నాడు. ఒకే పానవట్టంపై రెండువేర్వేరు శివలింగాలు ఉన్న ఏకై క దేవాలయం ఇదే. భక్తులు సంప్రదాయకంగా ముక్తీశ్వర(శివ) లింగం ఆశీర్వాదం కోరడానికి ముందు కాళేశ్వర(యమ) లింగానికి ప్రార్థనలు సమర్పిస్తారు. ముక్తీశ్వర లింగానికి రెండు నాసికరంద్రాలు ఉంటాయి. స్వామివార్లకు అభిషేకం సమయంలో పోసిననీరు ఈ రంధ్రాల్లోకి ఇంకి సంగమంలోని భూగర్భ నదులలోకి రహస్యంగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి క్షేత్రంలో పార్వతీదేవీ, సరస్వతీ ఆలయంతోపాటు మరిన్ని మహిమగల ఆలయాలు కొలువై ఉన్నాయి.

కాళేశ్వరంలో నేటినుంచి జూన్‌ ఒకటి వరకు అంత్యపుష్కరాలు

భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు

మంత్రి శ్రీధర్‌బాబు దంపతులతో ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement