తంగళ్లపల్లి/కోనరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వివిధ ఆలయాల్లో దొంగతలనాలకు పాల్పడ్డ ఇద్దరు దొంగలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడ్డ ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించాలని గుడులే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు తెలిపిని వివరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లా మ్యాదరమెట్లకు చెందిన చైతన్య మణికంఠ(21) ప్రస్తుతం వేములవాడ పరిధిలోని ఇంద్రనగర్(అగ్రహారం)లో ఉంటున్నాడు. తన బంధువులైన బస్వాపూర్‌కు చెందిన బోదాసు యాదగిరి, కోహెడ మండలం బద్దిపడగకు చెందిన కొమిరె శ్రీనులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గత జనవరి 21న తంగళ్లపల్లిలో రెక్కీ నిర్వహించిన ఈ ముఠా మరుసటి రోజు తెల్లవారుజామున లక్ష్మీనరసింహస్వామి ఆలయ యాగశాల తాళాలు పగులగొట్టి లోపలి ఉన్న పంచలోహ గరుడ వాహనాన్ని దొంగలించుకెళ్లారు. ఆలయ పూజారి ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తంగళ్లపల్లి ఎస్‌ఐ ఉపేంద్రచారి వాహన తనిఖీలు చేస్తుండగా సిద్దిపేటకు బైక్‌పై వెళ్తున్న చైతన్య మణికంఠ అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని రూరల్ సీఐ పేర్కొన్నారు. ఎస్‌ఐ ఉపేంద్రచారి, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుళ్లు సంపత్, శ్రావణ్‌లను అభినందించారు.
మరో దొంగ రిమాండ్
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని సుద్దాల ఎల్లమ్మ ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ మోకినిపల్లి బాబును రిమాండ్‌కు తరలించినట్లు చందుర్తి సీఐ రవీందర్ తెలిపారు. మండలంలోని పల్లిమక్తకు చెందిన మోకినపల్లి బాబు సుద్దాల, కొలనూర్‌లలోని ఎల్లమ్మ, నిజామాబాద్, కొండాపూర్‌లలోని పెద్దమ్మ, భూక్యారెడ్డితండా జగదాంబ, రామన్నపేటలోని దాసాంజనేయ, రుద్రంగిలోని మడేలేశ్వర ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ సొత్తును వేములవాడలో విక్రయించేందుకు వెళ్తుండగా పల్లిమక్త శివారులో పట్టుకున్నారు. బాబు నుంచి రెండు స్పీకర్లు, కార్ జాకీ, బంగారు పుస్తెలు, రూ.2వేల నగదు, వెండి కళ్లు స్వాధీనం చేసుకున్నారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి, కానిస్టేబుళ్లు విశాల్, జగన్, నాగరాజులను సీఐ అభినందించారు.


