కొడిమ్యాల: మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కొలపూరి సురేశ్ (39) గుండెపోటుతోనే చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. సురేశ్ తండ్రి రాజయ్య, ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. రాజయ్య పెద్ద కుమారుడు సురేష్ మంగళవారం సాయంత్రం పొలం వద్ద కొంతసేపు ఉంటానని, ఆవు పాలు పితికి తీసుకొస్తానని తండ్రికి చెప్పాడు. సురేశ్ అదే గ్రామంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రాత్రి ఇంటికి చేరుకున్నాడని తండ్రి భావించాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా సురేష్ విగతజీవిగా కనిపించాడు. నుదిటిపై, కుడి కాలి వేళ్ల వద్ద గాయాలు కనిపించడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఇందులో అక్కడి వైద్యులు గుండెపోటు కారణంగానే సురేశ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో బుధవారం రైలు ఢీకొని వ్యక్తి(55) మృతి చెందాడు. ఒకటో నంబరు ప్లాట్‌ఫారం దిగి రెండోనంబరు ప్లాట్‌ఫారంపైకి పట్టాలపైనుంచి వెళ్తుండగా రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. వ్యక్తి శరీరం రెండు ముక్కలైంది. నల్లనిప్యాంట్, తెల్లని బనియన్ ధరించి ఉన్నాడు. ఈనెల 18న తీసుకున్న ఝార్సీగూడ–సికింద్రాబాద్ రైలు టికెట్ లభ్యమైంది. ఇతర ఆధారాలేమీ లభ్యం కాలేదు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచామని జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి తెలిపారు. మృతుడి బంధువులు 99493 04574, 87126 58604 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.


