మంథని: నిషేధిత గ్లైఫోసెట్–41 ఎస్‌ఎల్(గడ్డిమందు)ను జిల్లాలో రహస్యంగా విక్రయిస్తున్నారని సమాచారం. గ్లైసెల్ బీటీ పత్తి విత్తనాలపై ఈ మందు వినియోగించంతో డిమాండ్ అధికంగా ఉంటోంది. మరికొన్ని రోజుల్లో వ్యవ సాయ సీజన్ ప్రారంభం కానుంది. వానాకాలం సీజన్ ప్రారంభమైతే కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో కొందరు రైతులు ముందుగానే కొనుగోలు చేస్తు న్నారని తెలిసింది. అదికూడా మహారాష్ట్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి నిల్వ చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మహారాష్ట్ర నుంచి దిగుమతి
తెలంగాణలో గ్లైఫోసెట్ విక్రయాలపై నిషేధం ఉంది. దీంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి ది గుమతి చేస్తున్నట్లు సమచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వంతెన, పెద్దపల్లి జిల్లా లోని పార్వతి బ్యారేజీలను రవాణాకు వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. ఇలా తీసుకొచ్చిన గడ్డిమందును జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని అటవీ గ్రామాల రైతులకు అంటగడుతున్నారు. ప్రభుత్వ అనుమతి విత్తన ప్యాకెట్లు ఒక్కోటి రూ.600 నుంచి రూ.700 ధరతో మార్కెట్‌లో లభిస్తున్నాయి. పేరులేని వితనాలు కిలోకు రూ.2 వేల చొప్పున బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసి పంటలో కలుపు సమస్య రాకుండా గ్లైఫోసెట్ వినియోగిస్తారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వివిధ కంపెనీల గడ్డిమందు సరిహద్దులు దాటుతోంది.
పేరులేని పత్తి విత్తనాలపై వినియోగం
పొలంగట్లు, వినియోగం లేని స్థలాల్లో వాడే గడ్డిమందును ప్రభుత్వ అనుమతి లేని, పేరులేని బీటీ–3 పత్తి విత్తనాలపై అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో దీనికి డిమాండ్ పెరిగింది. సాధారణంగా వేరే పత్తి పంటపై గ్లైఫోసెట్ చల్లితే పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ, పేరులేని బీటీ–3 పత్తిపై చల్లితే కలుపు సమస్య ఉండదు.
రూ.500 వెచ్చిస్తే సరి..
సాధారణంగా ఒక ఎకరం పత్తిలో కలుపు తీయడా నికి కూలీలకు రూ.6 వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చు అవుతుంది. గ్లైఫోసెట్ ఒకలీటరుకు రూ.500 చెల్లించి పంటపై చల్లితే సరిపోతుంది. మందు చల్లడం ద్వారా మొక్క కింద వరకు విషం చేరే అవకాశం ఉంది. తద్వారా పత్తి ఏరే సమయంలో కూలీలకు చర్మ, కిడ్నీ, కాన్సర్ లాంటి వ్యాధులు సోకుతున్నాయని ప్రభుత్వం గుర్తించి దానిని నిషేధించింది.
సీజన్‌లోనే పర్యవేక్షణ
విత్తన, ఎరువుల దుకాణాలను తరచూ తనిఖీ చేస్తూ నిషేధిత మందుల విక్రయాలను కట్టడిచేయడమే కాకుండా నిబంధనలు అతిక్రమించిన వ్యా పారులపై పీడీయాక్టు నమోదు చేయాల్సిన అధికారులు.. నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వ్యాపారుల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు తయారైంది. కేవలం సీజన్ ఆరంభంలోనే హడావుడి చేసే అధికారులు.. ఆ తర్వాత తనిఖీల విషయం విస్మరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 80వేలకుపైగా ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో పదిశాతం వరకు గుట్టుచప్పుడు కాకుండా పేరు లేని విత్తనాలతో సాగు చేస్తున్నట్లు తెలిసింది. ప్రాణాంతకమైన గడ్డిమందును కొంద రు రైతులు, సాధారణ ప్రజలు తాగి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ కోకొల్లలుగానే ఉన్నాయి.
విక్రయిస్తే కఠిన చర్యలు
నిషేధిత గడ్డి మందు విక్రయించేందుకు వీలులేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్లైఫోసెట్(గడ్డి మందు)పై నిషేధం ఉంది. ఆ మందు వినియోగం తప్పనిసరైతే మా దృష్టికి తీసుకురావాలి. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాం. తప్పనిసరి అని గుర్తిస్తే మా పర్యవేక్షణలో వినియోగించేలా చర్యలు తీసుకుంటాం.
– అంజనీ, ఏడీఏ, మంథని


