అటవీ ప్రాంతాల్లో ఫైర్‌లైన్‌ల ఏర్పాటు చెట్లు, వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు ఫారెస్ట్ సంరక్షణపై సర్కారు స్పెషల్ ఫోకస్
మంథనిరూరల్: కలప అక్రమ రవాణాను అరికట్టేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం, అటవీశాఖ.. అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఏటా వేసవిలో అడవి అంటుకుని చెట్లు బుగ్గిపాలయ్యేవి. అనేక వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అయ్యేవి. అయితే, అగ్గివ్యాపించకుండా చెట్లు, వన్యప్రాణులను రక్షించుకునేలా అటవీశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఫైర్‌లైన్‌లు ఏర్పాటు చేస్తోంది.
జిల్లాలో అటవీ విస్తీర్ణం 316.55 చ.కి.మీ.
జిల్లాలో 316.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మంథని, ముత్తారంతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్, మహాముత్తారం, కాటారం, మహదేవ్‌పూర్ మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. పెద్దవృక్షాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. అనేక రకాల వన్యప్రాణులు జీవిస్తున్నాయి. ఏటా వేసవిలో నిప్పంటుకుని చెట్లతోపాటు వన్యప్రాణులకూ నష్టం వాటిల్లుతుండేది. ఫైర్‌లైన్స్ ఏర్పాటుతో కొంతవరకు అడవులను రక్షించుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
ప్రూనింగ్ పేరిట అడవికి నిప్పు
ఏటా వేసవిలో అడవి అంటుకుంటోంది. వేసవి చివరి సమయంలో తునికాకు సేకరణ ఉంటున్న క్రమంలో ప్రూనింగ్‌పేరిట కొందరు అడవికి నిప్పు పెడుతుంటారు. రాలిపోయిన ఆకులు, చెత్తాచెదారం పూర్తిగా కాలిపోయి కొత్త ఆకులు చిగురిస్తాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఎలుగుడు పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఎండతీవ్రతకు చెట్లకొమ్మలు రాపిడికి గురై మంటలు చెలరేగుతాయని, దీనినే ఎలుగుడు అంటారని వారు వివరిస్తున్నారు. ఇలా ఏదోఒకవిధంగా అడవికి నిప్పు అంటుకుంటూనే ఉంటోంది.
ఫైర్‌లైన్‌ల ఏర్పాటుతో..
అడవిలో మంటలు వ్యాపించకుండా రెండేళ్లుగా ఫైర్‌లైన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారుల గుండా వెళ్లే వాహనదారులు సిగరెట్, బీడీల్లాంటివి పడేస్తే పక్కనే ఉండే ఎండిన ఆకులు అంటుకుని అడవిలోకి మంటలు వ్యాపిస్తాయి. అలాకాకుండా రోడ్డుకు ఐదు మీటర్ల దూరంలో ఎండిన ఆకులు, చెత్తను ఒకచోటికి చేర్చి లైన్‌లా ఏర్పాటు చేస్తారు. ఆ లైన్‌కు రెండు వైపులా శుభ్రం చేస్తారు. ఎండిన ఆకులతో ఏర్పాటు చేసిన లైన్‌కు నిప్పు అంటిస్తారు. ఇదిపూర్తిగా కాలిపోయి బూడిద మిగులుతుంది. ఆ ప్రాంతంలో మంటలు చెలరేగినా ఆ బూడిద లైన్ దాటి లోనికి మంటలు వ్యాపించవు.
అడవుల సంరక్షణపై అవగాహన
అడవుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా అటవీశాఖ అధికారులు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమీప గ్రామాల్లోని ప్రజలకు పలు అంశాలు వివరిస్తూ వేసవిలో ఎవరూ అటవీప్రాంతానికి వెళ్లకూడదని, ముఖ్యంగా పశువుల కాపరులు సూచనలు పాటించాలని చెబుతున్నారు. అడవుల్లో అగ్నివ్యాపించేలా ఎలాంటి పనులు చేయవద్దని, అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యతని అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అడవికి నిప్పు పెట్టినా, చెట్లు నరికినా చట్టపమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


