పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదోతరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 7,495 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పించి వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. పరీక్షల నిర్వహణకు 598 ఇన్విజిలేటర్లు, 41 మంది సూపరింటెండెంట్లు, 41 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు. 8 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, మరో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30గంటలకు పరీక్ష మొదలవుతుందని, ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారికి మాత్రమే అనుమతిస్తామని పరీక్షల కోఆర్డినేటర్ రాంరెడ్డి తెలిపారు. పరీక్ష సమయం పూర్తయిన తర్వాతే విద్యార్థులు కేంద్రం నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు.


