పెద్దపల్లి: ప్రజాగ్య పరిరక్షణ లక్ష్యంగా 99 రోజుల కార్యక్రమం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా.. ఇలా అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తూ మందు లు అందజేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆర్‌బీఎస్‌కే బృందాలు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లా ఆస్పత్రికి తరలింపు
జిల్లాలో 18 ప్రాథమిక, 8 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా ఆస్పత్రి, రెండు సీహెచ్‌సీలు, ఓ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని విభాగాల వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి సిఫారసు చేయనున్నారు. గైనకాలజిస్ట్, పిల్లల వైద్యనిపుణులు, ఎముకలు, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల వైద్యాధికారులతో సమన్వయం చేస్తూ వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందుకోసం నాలుగు దశలు ఎంచుకున్నారు.
తొలిదశ
ఈనెల 6 నుంచి 31 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పిల్లలు, తల్లులు, యువత, వృద్ధులతోపాటు మహిళలు, మహిళా సంఘాల సభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్ బీఎస్‌కే బృందాల ఆధ్వర్యంలో పిల్లలకు వైద్యపరీక్షలు చేస్తారు. ఈప్రక్రియ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
రెండోదశ
మహిళా సంఘాల్లోని సభ్యులకు 33 రకాల రక్తపరీక్షలు చేస్తారు. ఇందులో క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే అనుమానితులను గుర్తిస్తారు. ఇప్పటికే రొమ్ము, గర్భకోశ, ముక్క, నోటి తదితర క్యాన్సర్లతో బాధపడుతున్న వారి పరిస్థితిపై ఈనెల 28 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు సమీక్షించనున్నారు.
మూడోదశ
ఏప్రిల్ 21 నుంచి మే 5వ తేదీవరకు జిల్లా వ్యాప్తంగా మూడోవిడత వైద్య బృందాలు టీబీ, లెప్రసీ, బోదకాల తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నాయి. వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలు, నివారణచర్యలు, ఎండదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. ఎండ దెబ్బ తగిలినవారికి ఆస్పత్రిలో చికిత్స పొందేవిధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
నాలుగోదశలో
మే 16 నుంచి జూన్ 9వ తేదీ వరకు తలసేమియా, సికిల్‌సెల్, ఎనీమియా తదితర జబ్బులతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయనున్నారు. ఇందులో చిన్న అనారోగ్య సమస్యలను గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. పెద్దసమస్యలు ఉంటే జిల్లా కేంద్ర ఆస్పత్రికి సిఫారసు చేస్తారు. రోజూ వారి పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.


