రామగిరి(రామగుండం): సింగరేణిలోని ఆర్జీ–3 ఏరియాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కొందరు ముఠాగా ఏర్పాడి స్క్రాప్ చోరీ చేస్తున్నారు. అడ్డొచ్చి న వారిపై దాడులకూ తెగబడుతున్నారు. కొందరు ప్రైవేట్ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం దొంగలకు కలిపి వస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
ముఠాలుగా ఏర్పడి ..
గనుల్లో బొగ్గు ఉత్పత్తి, ఇతరత్రా పనుల కోసం వినియోగించే భారీయంత్రాలు, ఇనుప సామగ్రి తరచూ మరమ్మతులకు గురవుతుంటాయి. వాటిని గని ఆవరణల్లోని షెడ్లు, వర్క్‌షాపులు, స్టోర్స్‌కు తరలిస్తుంటారు. ఇంటిదొంగల ద్వారా సమాచారం అందుకుంటున్న దొంగలు.. ఒకట్రెండురోజుల పా టు తొలుత రెక్కీ చేస్తున్నారు. సామగ్రి బరువు బట్టి ఐదు నుంచి 15 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి పక్కా ప్రణాళికతో స్క్రాప్ చోరీ చేస్తున్నారు. అడ్డువచ్చే రక్షణ సిబ్బందిపైనా దాడులు చేస్తున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌లు, కార్లు, ట్రాలీల్లో స్క్రాప్ తరలిస్తున్నారు. కేబుల్ తొలిచి అందులోని రాగి తీగను తీసుకెళ్లి స్క్రాప్ దుకాణదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మూసివేసిన గనులు, విభాగాల ఆవరణలో నిల్వఉంచిన ఇనుప సామగ్రి, కేబుల్ పరికరాల కోసం దొంగలు వస్తున్నారు. చోరీచేసే సమయంలో స్థానికులు, రక్షణ సిబ్బందికి కనిపించేలా వాటి ఆరణల్లోని పిచ్చిమొక్కలు తొలిగించాలి. నిల్వ ఉంచిన స్క్రాప్, విలువైన సామగ్రిని ఎప్పటికప్పుడు మెయి న్ స్టోర్స్‌కు తరలించి భద్రత పెంచాలి. స్క్రాప్ దు కాణాలదారులు, దొంగలపై ప్రత్యేక నిఘా ఏర్పా టు చేయాలి. రాత్రివేళ్లలో ఎక్కువమంది సెక్యూరిటీగార్డులు విధుల్లో ఉండేలా చూడాలి. గనులు, విభాగాల ఆవరణల్లో మరిన్ని ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దొంగలకు సహకరించే ప్రధా నంగా ఇంటి దొంగలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
స్క్రాప్ దొంగల దాడిలో గాయపడ్డ ప్రైవేట్ సెక్యూరిటీగార్డు బొజ్జపల్లి శ్రీసాయిని సెంటినరీకాలనీ ఆర్జీ–3 ఏరియా డిస్పెన్సరీకి తరలించారు. డాక్టర్లు అందుబాటులో లేకసిబ్బంది ప్రథమ చికిత్స అందించి గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. గాయపడిన వ్యక్తికి వివిధ పరీక్షలు చే యాలని అక్కడి వైద్యులు సత్వర చికిత్స అందించేందుకు కాలయాపన చేశారనే ఆరోపణలూ వచ్చా యి. దీనిపై కార్మికులు, కార్మికు కుటుంబాలతోపాటు కార్మిక నేతలూ మండిపడుతున్నారు.
కారులో వస్తారు..
ఈనెల 7 వేకువజామున
రామగుండం–3 ఏరియాలోని ఓసీపీ–1. అంతకుముందే రెక్కీ నిర్వహించిన దొంగలు.. పక్కా ప్రణాళికతో కోల్ కారిడార్ వద్దకు కారులో దూసుకు వచ్చారు. అక్కడ నిల్వఉన్న ఇనుప సామగ్రి అపహరించేందుకు యత్నించారు. సింగరేణి, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో దొంగలు వారిని కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు బొజ్జపల్లి శ్రీసాయి తీవ్రగాయాల పాలయ్యాడు. సహ సిబ్బంది వెంటనే ఆర్జీ–3 ఏరియా డిస్పెన్సరీకి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
నిఘా పెంచాం
సింగరేణి ఆస్తుల పరిరక్షణ కోసం గస్తీ బృందాలను ఏర్పాటు చేశాం. చోరీలకు ఆస్కారం ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా నిఘా తీవ్రతరం చేశాం. – మధుసూదన్, జీఎం, ఆర్జీ–3


