● ఇంకా స్పష్టత ఇవ్వని సర్కారు ● ఆశావహుల ఎదురుచూపులు | - | Sakshi
Sakshi News home page

● ఇంకా స్పష్టత ఇవ్వని సర్కారు ● ఆశావహుల ఎదురుచూపులు

Mar 10 2026 7:16 AM | Updated on Mar 10 2026 7:16 AM

● ఇంకా స్పష్టత ఇవ్వని సర్కారు ● ఆశావహుల ఎదురుచూపులు

పెద్దపల్లిరూరల్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి దాదాపు 9 నెలలు కావస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత ఇవ్వడంలేదు. ఆ పదవులపై కన్నేసిన వారికి ఉత్కంఠ తప్పడంలేదు. గతేడాది జూలై 4వ తేదీన జెడ్పీ, మండల పరిషత్‌ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పట్నుంచి జిల్లా, మండల పరిషత్‌లు ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో 13 జెడ్పీటీసీ, 138 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓటరు జాబితా సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణకు అన్నిఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంది.

మారనున్న రిజర్వేషన్లు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు (42శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం) కేటాయించినా.. ప్రస్తుత పరిస్థితులతో అవిమారే అవకాశాలే అధికంగా ఉన్నా యని అధికారవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీ చట్టం ప్రకారం.. అప్పటి రిజర్వేషన్లు రెండుసార్లు అమలు చేయాలి. కానీ ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, రాజకీయ సమీకరణలతో కొత్తగా మండలాలు ఏర్పాటు కావడం, ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం లాంటి కారణాలతో రిజర్వేషన్లలో మార్పులు ఖాయమంటున్నారు.

మూడునెలలు ఆగాల్సిందేనా?

ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. ఆ వెంటనే ప్రాదేశిక సమరానికి సిద్ధపడుతుందని ఆశావహులు భావించారు. కానీ, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేస్తుందనే ఊహగానాలు కూడా వినవస్తున్నాయి. అంతే కాదు.. ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాలకు పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఏ పద్ధతి అయినా ఎన్నికలు ఇప్పుడే నిర్వహించే పరిస్థితులైతే కనిపించడం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వం చేపట్టడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement