పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్ మార్కండేయకాలనీకి చెందిన గంగాదేవి, శ్రీనివాస్ దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాల ని విన్నవించారు. తగిన చర్య తీసుకోవాలని డీఆ ర్డీవో పీడీకి కలెక్టర్ సూచించారు. భోజన్నపేటకు చెందిన ఆవుల వసంత.. తాను ఇంటి నిర్మాణం చేపడితే అనుమతి లేదని కొందరు అడ్డుకుంటున్నారని, పనులకు అనుమతి మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. విచారణ చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ సూచించారు. అందుగులపల్లికి చెందిన సంపూర్ణ.. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, బేస్మెంట్ వరకు నిర్మించినా తొలివిడత బిల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
‘సూర్య ఘర్’ను సద్వినియోగం చేసుకోవాలి
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. కలెక్టరేట్‌లో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథం ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు టీజీ రెడ్కో ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు తమ ఇళ్లరూఫ్‌పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని, ఇందుకోసం మూడు కిలో వాట్ల ప్యానల్స్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.78,000 సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ఎ న్పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్, డీఈ రాజబ్రహ్మయ్యచారి, రెడ్ కో జిల్లా మేనేజర్ మనోహర్, డీసీవో శ్రీమాల తదితరులు పాల్గొన్నారు.


