నగర అభివృద్ధే సర్కార్ లక్ష్యం
కోల్‌సిటీ(రామగుండం): అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ చేపట్టిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. మేయర్ మహంకాళి స్వామితో కలిసి బల్దియా కార్యాలయంలో శుక్రవారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ ఫలాలు అర్హులకు చేరుతాయన్నారు. నగరంలో పారిశుధ్యం మెరుగుపర్చాలని వార్డు అధికారులకు సూచించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లు, విద్యార్థులను భాగస్వాములను చేయాలని అన్నారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సమర్థవంతంగా అమలు చేయడానికి రోజూవారి షెడ్యూల్ రూపొందించామని అన్నారు. కార్యక్రమాలపై అవగాహన కోసం 2కే, 5కే రన్ నిర్వహిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లతోపాటు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మెప్మా టీఎం మౌనిక తదితరులు పాల్గొన్నారు.


