గోదావరిఖని: కార్మికులకు కనీసవేతనాలు త్వరతగతిన అమలు చేయాలని రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ కోరారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లేబర్ కమిషనర్ పమేలా సత్పతిని హైదరాబాద్‌లోని ఆమె కార్యాలయంలో బుధవారం జనక్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లేబర్ కమిషనర్ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో.. కనీస వేతన సలహా మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, నిర్వహించిన సమావేశాలు, కనీస వేతనాల అమలుకు చేపట్టిన చర్యలను వివరించారు. రాష్ట్రంలో సుమారు 1.30కోట్ల మంది కార్మికులకు న్యాయం చేయాలంటే కనీస వేతనాలను త్వరితగతిన అమలు చేసేలా కార్మిక శాఖ చొరవ తీసుకోవాలని జనక్ ప్రసాద్ కోరారు.


