దివ్యాంగులకు సామగ్రి పంపిణీ ఎప్పుడో?
పెద్దపల్లి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సామగ్రిని వందశాతం రాయితీపై దివ్యాంగులకు అందించేందుకు జిల్లాస్థాయి అధికారులు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. 2022–23 సంవత్సరంలో మూడు చక్రాల స్కూటీలు, బ్యాటరీ ఆధారంగా నడిచే వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందించాలని నిర్ణయించారు. గతనెల 31వ తేదీ వరకు మహిళాశిశు, వికలాంగ, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 271 దరఖాస్తులు అందిన ట్లు అధికారులు వివరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అర్హులను ఎంపికచేసి.. వాహనాలు, ఇతర సామగ్రి పంపిణీ చేయడంలో జాప్యమవుతోంది.
ఎండకు ఎండుతూ..
దరఖాస్తులు ఆహ్వానించే సమయంలోనే స్కూటీలు జిల్లా కేంద్రానికి వచ్చి చేరాయి. వాటిని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసి వదిలేశారు. కానీ, అధికారులు అర్హులను త్వరగా ఎంపిక చేసి, వాటిని పంపిణీ చేసిఉంటే.. ఎండకు ఎండతూ, వానకు తడు స్తూ ఉండేవి కాదని దివ్యాంగులు అంటున్నారు.
ఎన్నికల కోడ్‌తో ఆలస్యం
దివ్యాంగులకు వచ్చిన వాహనాలు, పరికరాలు పంపిణీ చేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డుగా వచ్చిందని అధికారులు చెబుతునారు. దీంతో పంపిణీ ఆలస్యమైనట్లు వారు వివరిస్తున్నారు. ఈనెల 16వ తేదీతో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో అధికారులు వాటి పంపిణీకి చర్యలు చేపడతామని అంటున్నారు.
వారంలోగా పంపిణీ
మంత్రి, ప్రజాప్రతినిధులు సమయం ఇవ్వగానే వారంలోగా దివ్యాంగులకు సామగ్రి, పరికరాలు, వాహనాలు పంపిణీ చేస్తాం. ఇప్పటికే కొంతఆలస్యమైన మాట వాస్తవమే. ఎన్నికల కోడ్ రావడం ఇందుకు కారణం.
– వేణుగోపాల్, డీడబ్ల్యూవో


