సింగరేణి పరిరక్షణకు ఉద్యమించాలి
గోదావరిఖని(రామగుండం): సింగరేణి పరిరక్షణకు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక బీఎంఎస్ కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్ర, ద్వంద వైఖరి విధానం వల్ల కొంగుబంగారమైన సింగరేణి పరిశ్రమ నిర్వీర్యం అవుతోందన్నారు. ప్రభుత్వం నుంచి సంస్థకు రావలసిన బొగ్గు బకాయిలు రూ.51వేల కోట్లు చెల్లించేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎంఎస్ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, విద్య, వైద్యం, నూతన బొగ్గు గనుల సాధన కోసం పనిచేస్తుందన్నారు. ఈసందర్భంగా యూనియన్‌లో చేరిన నాయకులు బెల్లంకొండ ముత్యంరావు, వేముల శ్రీనివాస్‌కు కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. కర్రావుల మహేశ్, పల్లె శ్రీనివాస్, తాట్ల లక్ష్మయ్య, నీలం శ్రీనివాస్, మేడ అజయ్‌కుమార్, సిద్ధం నరసయ్య, బంగారి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


