అప్పులే మిగిలాయి
గోదావరిఖని: కార్పొరేషన్ ఎన్నికలు కొందరు పరాజితులకు అప్పులే మిగిల్చాయి. కార్పొరేటర్‌గా గెలుపొందాలనే వారి తపన.. ఎన్నికల్లో ఎంతవరకై నా ఖర్చు చేసేలా ముందుకు నడిపించింది. ఆ తర్వాత మొదలైన ఎపిసోడ్ అప్పులపాలయ్యే వరకూ తీసుకొచ్చింది. బరిలో నిలిచినవారు ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
చేతిలో డబ్బుల్లేకున్నా..
కొందరు అభ్యర్థులు తమ చేతుల్లో డబ్బుల్లేకున్నా ఇంట్లోని బంగారం తనఖా పెట్టారు. ఇంకొందరు భూములు విక్రయించి రంగంలో దిగారు. ఇలాంటి వారిలో కొందరు విజయం సాధించారు. గెలిచిన వారు పెట్టిన పెట్టుబడికి ఫలితం దక్కిందనే సంతోషంతోపాటు ఐదేళ్లపాటు పదవులు అనుభవించనున్నారు. కానీ రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఓటమిపాలైన వారి పరిస్థితే అధ్వానంగా తయారైంది.
బరిలో 315మంది.. గెలిచింది 60మంది..
రామగుండం కార్పొరేషన్‌లో 315 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వీరిలో 60 మంది కార్పొరేటర్లుగా విజయం సాధించారు. మిగతా 255 మంది పరాజితులుగా మిగిలారు. ఎన్నికలు ఈసారి భారీఖర్చుతో కూడుకున్నది కావడంతో అభ్యర్థులు పోటీపడి డబ్బులు వెచ్చించారు. చివరకు అప్పుల పాలయ్యారు. ఇండిపెండెంట్లేకాదు.. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం బాధితులుగానే మిగిలారు.
బంగారం విడిపించేదెలా?
తమ గెలుపుకోసం అనేక మార్గాలు అనుసరించిన కొందరు అభ్యర్థులు తమ కుటుంబంలోని మహిళలపై ఉన్న ఆభరణాలు తాకట్టుపెట్టి మరీ అప్పులు చేశారు. విజయం సాధించినవారు కొంతవరకు అప్పులు తీర్చే అవకాశం ఉన్నా.. ఓటమిపాలైన వారిఆర్థిక పరిస్థితి చర్చకు దారితీసింది. తనఖా పెట్టిన బంగారం విడిపించడం కూడా కష్టమని కొందరు ఆవేదన చెందడం గమనార్హం. ఏదిఏమైననా.. ఈసారి ఎన్నికలు కొద్దిమందికి సంతోషం ఇవ్వగా.. చాలామందిలో తీరని వేదన, అప్పుల కుప్పను మిగిల్చిందనే చర్చ సాగుతోంది.
రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల వ్యయం
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.10లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా బీజేపీ అధిష్టానం ఈసారి ఒక్కో అభ్యర్థికి రూ.3 లక్షల నుంచి రూ.8లక్షల వరకు పార్టీ ఫండ్ అందజేసిందనే ప్రచారం ఉంది. అధికార పార్టీ అభ్యర్థులకు కూడా రూ.5లక్షల వరకు పార్టీ నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షల వరకూ కేటాయించినట్లు చెబుతున్నారు. ఎవరు ఎన్ని నిధులిచ్చినా.. కొందరు అభ్యర్థులు మాత్రం తమ తాహతుకు మించి ఓటర్ల కోసం మందు, విందు, బహుమతుల రూ పంలో భారీగా వ్యయం చేశారనే చర్చ సాగుతోంది.
నగరంలో రూ.40 కోట్ల ధనప్రవాహం
ఈసారి ఎన్నికల్లో రూ.40 కోట్ల వరకు ధనప్రవా హం సాగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వే స్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు ప్రత్యర్థులను బట్టి రూ.10లక్షల నుంచి రూ.40లక్ష ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఓక్కో డివి జన్‌లో మద్యం కూడా భారీగా పంచిపెట్టారు. కానీ, గెలుపు ఒక్కో డివిజన్‌లో ఒక్కరినే వరించింది.


