బీ థర్మల్ ప్లాంట్ వేలం?
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీ– థర్మల్ పవర్‌స్టేషన్ (ఆర్‌టీపీఎస్) 2024 జూన్ 4వ తేదీన మూతపడిన విషయం తెలిసిందే. అదే స్థానంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాలం చెల్లిన బాయిలర్, టర్బయిన్, కోల్‌ప్లాంట్, ఎలక్ట్రో స్టాటిక్ ప్రిసిబిరేటర్ (ఈఎస్‌పీ) తదితర విభాగాలపై నివేదిక రూపొందించిన ఇంజినీర్లు ఇటీవల ఉన్నతాధికారులకు పంపించారు. పరిశీలించిన జెన్‌కో సీఎండీ, డైరెక్టర్లు.. వాటిని వేలం వేసేందుకు వాల్యుయేషన్ కన్సల్టెన్సీని నియమించనున్నారు. ఈ ప్రక్రియ నెలరోజుల్లోగా పూర్తిచేసే పనిలో విద్యుత్ సౌధ అధికారులు నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం.


