మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా?
జ్యోతినగర్(రామగుండం): మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ త్వరలోనే విడుదల కాబోతంది. వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులు పోటీచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వీరు ఈ నియమనిబంధనలు, సూచనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పార్టీ ఆఫీస్ అద్దె, కరెంట్ బిల్లు, సిబ్బంది జీతాలు ఎన్నికల లెక్కల్లోకి రావు. పార్టీ ఆఫీస్ నుంచే ప్రచారం చేస్తే అభ్యర్థి ఖర్చులోకి వస్తుంది. స్వయంగా వచ్చే మద్దతుదారుల ఖర్చు, ప్రయాణం, భోజనం ఖర్చులు అభ్యర్థి ఏర్పాటు చేస్తే ఎన్నికల లెక్కల్లోకి వస్తుంది. అభ్యర్థి వ్యక్తిగత జీవన ఖర్చులు ఎన్నికలకు సంబంధం లేని ఖర్చులు.. ఇంటి అద్దె, ఇంటి కరెంట్/నీటి బిల్లులు, కుటుంబ భోజన ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు, మత/సంప్రదాయ కార్యక్రమాల ఖర్చులు ఎన్నికల ప్రచారం చేయనప్పుడు మాత్రమే, పూజలు, పెళ్లి / శుభకార్యాలు, అంత్యక్రియలు కాని అక్కడ కూడా ఎన్నికల ప్రచారం చేస్తే ఖర్చులోకి వస్తుంది. అభ్యర్థి అనుమతితో లేదా ఆదేశంతో జరిగిన ప్రతీఖర్చు, కచ్చితంగా ఖర్చు లెక్కలోకి వస్తుంది. పార్టీ చేసింది అనే కారణం చెప్పి తప్పించుకోలేరు.
వీటి ఖర్చులు లెక్కిస్తారు..
ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, వాహనాల అద్దె, మైక్/డీజే, సభలు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారం, కార్యకర్తలకు భోజనం, నీరు. పార్టీ చేసిన ఖర్చు అభ్యర్థి వ్యయంగా లెక్కిస్తారు. ప్రతీ అభ్యర్థి రిజిష్టర్‌లో ఖర్చు నమోదు చేయాలి. 30రోజుల్లోగా అధికారులకు సమర్పించాలి. పార్టీ, స్వతంత్ర అభ్యర్థులకు ప్రత్యేక సడలింపు ఏమీలేదు.
ఎన్నికల అధికారుల పరిశీలన..
నామినేషన్ పత్రాలను అధికారులు తొలుత పరిశీలించేవి.. అభ్యర్థి అర్హతలు (వయసు, ఓటరు నమోదు), నామినేషన్ ఫామ్, ప్రతిపాదించిన వ్యక్తి అర్హుడేనా?, పార్టీ అభ్యర్థి అయితే – పార్టీ అథరైజేషన్ లెటర్ ఉందా?, అఫిడవిట్ ఇచ్చారా? అనేవి పరిశీలిస్తారు. చిన్న పొరపాటు ఉన్నా నామినేషన్ తిరస్కరిస్తారు.
ఎన్నికల ఖర్చుల తనిఖీ
ఖర్చుల రిజిష్టర్ నిర్వహిస్తున్నారా? ప్రతీ ఖర్చుకు బిల్లు/రసీదు ఉందా?, ఖర్చు పరిమితి దాటిందా?, పార్టీ చేసిన ఖర్చు చూపించారా?, సోషల్ మీడియా ఖర్చులు చూపించారా?, వాహనాలు – ప్రచారం, ఎన్ని వాహనాలు వాడుతున్నారు?, అనుమతి తీసుకున్నారా? వాహనాలపై ఫ్లెక్సీలు అనుమతి మేరకే ఉన్నాయా? ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి తీసుకున్నారా అనే వాటిని అధికారులు తనిఖీ చేస్తారు.
ప్రచార సామగ్రి
ప్రచార సామగ్రి అనుమతితోనే పెట్టారా?, ప్రభుత్వ ఆస్తులపై పెట్టారా? (అలా చేస్తే నేరం), పరిమాణం, సంఖ్య అనుమతి మేరకేనా?, ముద్రణ వివరాలు(ప్రింటర్ పేరు)ఉన్నాయా?, సభలు, సమావేశాలు, సభకు ముందే అనుమతి తీసుకున్నారా?, మైక్ / డీజే టైమ్ పరిమితిలోనేనా?, ఓటర్లకు డబ్బులు, వస్తువులు పంచారా?, మద్యం పంపిణీ జరిగిందా అనేవి పరిశీలిస్తారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్
ప్రభుత్వ పథకాలను ప్రచారానికి వాడారా, అధికారులను ప్రభావితం చేశారా, మత/కుల ప్రాతిపదికన ప్రచారం చేశారా, ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యలు చేశారా? అని ఆరా తీస్తారు.
పోలింగ్ రోజు
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేశారా, డబ్బులు, బహుమతులు ఇచ్చారా, బూత్ క్యాప్చరింగ్ ఉందా? అనే వాటిపై దృష్టి సారిస్తారు. పొరపాట్లు చేస్తే.. నోటీసులు, జరిమానా జారీచేస్తారు. ఎన్నిక రద్దు, డిస్‌క్వాలిఫికేషన్ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసేవారు ఈ నియమ నిబంధనలు కచ్చింతంగా తెలుసుకుని అందుకు లోబడి వ్యవహరించాలి.
పోటీకి అర్హతలు
భారత పౌరుడు, 21ఏళ్ల వయసు ఉండి, వార్డులో ఓటరుగా నమోదై ఉండాలి.
– పార్టీ బీ ఫామ్, బలపర్చేందుకు ఓటరు ఉంటే పార్టీ చిహ్నం వస్తుంది. నామినేషన్ ఫారమ్, అఫిడవిట్, స్వతంత్ర అభ్యర్థికి 10 మంది బలపర్చాలి.
నామినేషన్‌కు కావల్సిన పత్రాలు..
నామినేషన్ ఫామ్, అఫిడవిట్ (ఆస్తులు, కేసులు వివరాలు), అభ్యర్థి ఓటర్/ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, పార్టీ అభ్యర్థికి బీఫామ్, డిపాజిట్.
ఎన్నికలు.. ఖర్చులు
పార్టీ అభ్యర్థికి, స్వతంత్ర అభ్యర్థికి ఖర్చు పరిమితి ఒకేలా ఉంటుంది.
–మునిసిపాలిటీ రకం – ఖర్చు పరిమితి
నగర పంచాయతీలకు రూ.2 లక్షలు, గ్రేడ్–3 మునిసిపాలిటీకి రూ.3 లక్షలు, గ్రేడ్–2 మునిసిపాలిటీ రూ.4 లక్షలు, గ్రేడ్–1 మునిసిపాలిటీకి రూ.5లక్షలు, మునిసిపల్ కార్పొరేషన్ రూ.10 లక్షలు వరకు పరిమితి ఉంది.


