మోడల్ స్కూల్ పిలుస్తోంది
దరఖాస్తుల స్వీకరణ
● ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల ● ఆరో తరగతికి దరఖాస్తుల ఆహ్వానం
● ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ● జిల్లాలో 11 మోడల్ స్కూళ్లు
● ఉమ్మడి జిల్లాలో 38 ఆదర్శ పాఠశాలలు
కరీంనగర్‌టౌన్: ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ విద్యార్థులకు ఆదర్శపాఠశాలలు ఓ వరం. బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తున్న మోడల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశాలకు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. 6వ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్19న ఆయా పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 7,8,9,10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అదేరోజు మధ్యాహ్నం ప్రవేశపరీక్ష జరుగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125, మిగతా వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఈనెల 28 నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బాలికలకు హాస్టల్ వసతి
ఆదర్శ పాఠశాలల్లో బాలికలకు హాస్టల్ వసతి ఉంది. ఉమ్మడి జిల్లాలో 38 ఆదర్శ పాఠశాలలు ఉన్నా యి. ఆయా పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు మాత్రమే హాస్టల్ సౌకర్యం ఉంది. హాస్టల్‌లో 9,10 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంద మందికి విద్యార్థులకు మాత్రమే అవకాశముంది. హాస్టల్ కు కనీసం మూడు కిలోమీటర్ల దూ రం నుంచి ఆపై దూరంగా ఉండేవారు మాత్రమే ప్రవేశానికి
అర్హులు.
ఉమ్మడి జిల్లాలో 38 ఆదర్శ పాఠశాలలున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్, కరీంనగర్ మండలం ఎలగందల్, మానకొండూర్ మండలం పోచంపల్లి, రామడుగు, వీణవంక, జమ్మికుంట మండలం టేకుర్తి, చిగురుమామిడి మండలం ముల్కనూర్, గంగాధర, శంకరపట్నం, తిమ్మాపూర్,సైదాపూర్‌లలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు 100 సీట్లు ఉంటాయి. మిగతా 7,8,9,10వ తరగతుల్లో ఖాళీలుగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. ఆదర్శ పాఠశాలలు ఉన్న మండలాలతో పాటు సమీప మండలాల విద్యార్థులకు ఇది మంచి అవకాశం.
ఆరవ తరగతితో పాటు 7,8,9,10వ తరగతులకు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలి. ఏప్రిల్ 09వ తేదీ నుంచి హల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవాలి. 19న 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 7,8,9,10 తరగతుల ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో వందమార్కులకు వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఆరోతరగతిలో తెలుగు, గణితం, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ఒక్కోదాని నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ఏడు నుంచి పదో తరగతులకు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్ నుంచి వంద ప్రశ్నలుంటాయి. ఒక్కోదాని నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. రెండు గంటల పాటు అబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.


