అభివృద్ధికి నమూనా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి నమూనా

Jan 19 2026 4:45 AM | Updated on Jan 19 2026 4:45 AM

అభివృ

అభివృద్ధికి నమూనా

కోల్‌సిటీ(రామగుండం): జనగామ గ్రామ పంచా యతీ నుంచి ప్రారంభమైన రామగుండం ప్రాంత ప్రయాణం పారిశ్రామిక, వైద్య నగరంగా మారుతోంది. అభివృద్ధికి శరవేగంగా అడుగులు వేస్తోంది. పంచాయతీ వార్డుల స్థాయి నుంచి 60 డివిజన్లకు విస్తరించి నగరంగా ఎదిగింది.

నోటిఫైడ్‌ ఏరియా నుంచి..

గోదావరిఖని, జనగామ, రామగుండం, మేడిపల్లి, మల్కాపూర్‌, లక్ష్మీపురం, మారేడుపాక, అల్లూరు, జంగాలపల్లిని 1982లో విలీనం చేసిన అప్పటి ప్రభుత్వం.. రామగుండం నోటిఫైడ్‌ ఏరియాగా ప్రకటించింది. తొలి చైర్మన్‌గా అప్పటి ఎమ్మెల్యే మాతంగి నర్సయ్య, ఆ తర్వాత మరో ఎమ్మెల్యే మాలెం మల్లేశం కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.

మేడారం నుంచి రామగుండంగా..

1957 నుంచి 2009 వరకు రామగుండం ప్రాంతం మేడారం శాసనసభా నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో రామగుండంగా ఆవిర్భవించింది.

తొలుత జనగామ పంచాయతీగా..

పక్కనే ఉన్న జనగామ పేరిట గ్రామపంచాయతీ ఏర్పాటు చేశారు. లక్ష్మీనగర్‌లో నిలిచిన మల్టీలెవల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణ స్థలంలోనే నోటిఫైడ్‌ ఏరియా, పాత మున్సిపల్‌ కార్యాలయం ఉండేది. భవన నిర్మాణానికి 1972 ఫిబ్రవరి 22న అప్పటి సీఎం పీవీ నర్సింహారావు శంకుస్థాపన చేశారు. 1977 జనవరి 17న వ్యవసాయ మంత్రి జువ్వాడి చొక్కారావు ప్రారంభించారు. 11 వార్డులు కలిగి ఉన్న పంచాయతీ సర్పంచ్‌గా గీట్ల జనార్దన్‌రెడ్డి వ్యవహరించారు.

1995లో ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంగా

రామగుండాన్ని ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంగా 1995లో ప్రభుత్వం ప్రకటించింది. 1997లో ప్రత్యక్ష పద్ధతిన జరిగిన తొలిఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2001లో ప్రథమశ్రేణి గుర్తింపు రాగా, 2003లో ప్రత్యేకశ్రేణిగా హోదా పెంచారు. 2004లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌గా బడికెల రాజలింగం ఎన్నికయ్యారు.

తొలిమేయర్‌గా కొంకటి..

కార్పొరేషన్‌గా ఆవిర్భవించాక తొలిసారి 2014 మార్చిలో జరిగిన ఎన్నికల్లో పరోక్ష పద్ధతిన కొంకటి లక్ష్మీనారాయణ మేయర్‌గా ఎన్నికయ్యారు. 2020లో జరిగిన ఎన్నికల్లో బంగి అనిల్‌కుమార్‌ మేయర్‌గా గెలుపొందారు.

కార్పొరేషన్‌గా రామగుండం..

తొలుత జనగామ, మేడిపల్లి, మల్కాపూర్‌, జంఘాలపల్లి, రామగుండం, లక్ష్మీపురం(ఎల్కలపల్లి హా మ్లెట్‌), మారేడుపాక, అల్లూరు గ్రామాల విలీనంతో 1982లో రామగుండం నోటిఫైడ్‌ ఏరియాగా ఏర్పడింది. 1995లో ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ ఆవిర్భవించగా, 2001లో ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా మారింది. 2003లో స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా సెలెక్షన్‌ గ్రేడ్‌ స్థాయికి చేరుకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక పరిస్థితుల్లో 34 వార్డులతో ఉన్న మున్సిపాలిటీని 50 డివిజన్లకు పెంచి 2010 ఫిబ్రవరి 25న రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు.

60 డివిజన్లుగా విస్తరణ..

సుమారు 93.87 చ.కి. వైశాల్యం కలిగిన రామగుండం నగరంలో 50 డివిజన్లు ఉండగా, గతేడాది జూన్‌లో లింగాపూర్‌, వెంకట్రావ్‌పల్లి, ఎల్కలపల్లిగేట్‌, అక్బర్‌నగర్‌ ప్రాంతాలను విలీనం చేశారు. దీంతో నగర డివిజన్లు 60కు చేరాయి. వైశాల్యం కూడా 100 చ.కి.కు విస్తరించింది.

పరిశ్రమలే ప్రగతికి పునాది..

రామగుండం అభివృద్ధి వెనుక ప్రధానంగా పరిశ్రమలే ఉన్నాయి. ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, సింగరేణి, జెన్కో సంస్థలు నగర ఆర్థిక వ్యవస్థకు ప్రాణంగా మారాయి. వేలాది కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అకాశాలు కల్పిస్తూ, వాణిజ్య, వ్యాపార, రవాణా రంగాలను పరుగులు పెట్టిస్తున్నాయి.

మెడికల్‌ హబ్‌గా..

రామగుండం నగరం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. మెడికల్‌ పీజీ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, పారామెడికల్‌ కోర్సుల ఏర్పాటు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో వైద్యవిద్యా కేంద్రంగా విస్తరిస్తోంది. మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడంతోపాటు, ఇతర జిల్లాల నుంచి కూడా పేషెంట్లు భారీగా తరలివస్తున్నారు.

జనగామ పంచాయతీ నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వరకు..

ప్రగతి పథంలో రామగుండం బల్దియా

నోటిఫైడ్‌ ఏరియాతో మొదలైన ప్రయాణం

ప్రస్తుతం 60 డివిజన్లకు ఎదిగిన నగరం

అభివృద్ధికి నమూనా 1
1/2

అభివృద్ధికి నమూనా

అభివృద్ధికి నమూనా 2
2/2

అభివృద్ధికి నమూనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement