వేతన వెతలు
పెద్దపల్లి: నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. ఇంటి అద్దె, బస్సు చార్జిలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఔషధాలు, నిత్యావసరాల కొనుగోలుకు చేతిలో డబ్బుల్లేక ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
21 నుంచి సమ్మెలోకి..
వేతనాలు విడుదల చేయించేలా రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. విధిలేని పరిస్థితుల్లో ఈనెల 21 నుంచి సమ్మె చేసేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్‌కుమార్‌కు ఇటీవల వినతిపత్రం అందజేశారు. ఆశ వర్కర్లు, స్టాఫ్‌నర్స్‌లు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్ట్‌లు, అకౌంటెంట్లు, అటెండర్, స్వీపర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, డీపీఎంలు, డీఈవోలు తదితర విభాగాల్లో పనిచేసే వారందరూ విధులు బహిష్కరించేందుకు యోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రప్రభుత్వం 40శాతం నిధులను వీరికి వేతనాలు చెల్లించేలా నిధులు కేటాయించాల్సి ఉంది.
వైద్య సేవలపై ప్రభావం
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 16, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 8 ఉన్నాయి. వీటితోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండంలో ఆస్పత్రులు ఉన్నాయి. సిబ్బంది, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే.. వైద్యసేవలపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఐదు నెలలుగా అందని జీతాలు
21 నుంచి సమ్మెలోకి ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది
వైద్యసేవలపై ప్రభావం పడే అవకాశం
అధికారులు చొరవ తీసుకోవాలని విన్నపం


