అప్పుడు తీర్మానం.. ఇప్పుడు అభ్యంతరం | - | Sakshi
Sakshi News home page

అప్పుడు తీర్మానం.. ఇప్పుడు అభ్యంతరం

Nov 28 2025 7:20 AM | Updated on Nov 28 2025 7:20 AM

అప్పుడు తీర్మానం.. ఇప్పుడు అభ్యంతరం

అప్పుడు తీర్మానం.. ఇప్పుడు అభ్యంతరం

● రాఘవాపూర్‌లో జిల్లా కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు ● పెద్దపల్లిలోనే నిర్మించాలంటూ పలువురి అభ్యంతరం

● రాఘవాపూర్‌లో జిల్లా కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు ● పెద్దపల్లిలోనే నిర్మించాలంటూ పలువురి అభ్యంతరం

పెద్దపల్లిరూరల్‌: జిల్లా ప్రధాన న్యాయస్థానంతో పాటు సీనియర్‌, జూనియర్‌, పోక్సో తదితర కోర్టులన్నీ ఒకే చోట నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించి రూ.83కోట్లు మంజూరు చేసింది. స్థానిక రెవెన్యూ అధికారులు పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ (పెద్దపల్లి– మంథని ప్రధానరోడ్డు సమీపంలో)లో 10ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంతో కోర్టుసముదాయాల కొత్త భవనాన్ని నిర్మించేందుకు టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్‌ నిర్మాణానికి వీలుగా చదును చేసే పనులు చేపట్టారు.

పెద్దపల్లిలోనే నిర్మించాలని నిరసనలు

పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ వద్ద జిల్లా కోర్టు నిర్మాణానికి సీనియర్‌ న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు తీర్మానించడంతో స్థలం మంజూరైందని అసోసియేషన్‌ అధ్యక్షుడు భాస్కర్‌ చెబుతున్నారు. సభ్యుల ఆమోదం మేరకే ప్రధాన రోడ్డుకు అతిసమీపంలో స్థలం మంజూరైందని పేర్కొంటున్నారు. కాగా, చదును చేసే పనులు సాగుతున్న సమయంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, పలువురు న్యాయవాదులు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భాస్కర్‌ ఏకపక్షంగా రాఘవాపూర్‌లో నిర్మించాలంటున్నాడని పేర్కొంటున్నారు. పెద్దపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాఘవాపూర్‌లో నిర్మిస్తే ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. జిల్లా కోర్టు కొత్త భవన పనులకు పెద్దపల్లిలోనే స్థలం కేటాయించాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని కలిసి తమకు మద్దతునివ్వాలని కోరారు.

జిల్లా కేంద్రంలో స్థల సమస్య

పెద్దపల్లి పట్టణంలో స్థల సమస్య ఉంది. దశాబ్దాల కాలం క్రితమే బస్‌డిపో మంజూరైనా స్థలం అందుబాటులో లేక ఏర్పాటు సాధ్యం కాలేదని పలువురు అంటున్నారు. ప్రజల చిరకాలవాంఛ నెరవెర్చేందుకు బస్టాండ్‌ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూల్చి ఆ స్థలంలో బస్‌డిపో నిర్మించే పనులు పురోగతి ఉన్నాయి. కాగా బస్‌డిపోను రాఘవాపూర్‌కు మార్చి ఆ స్థలంలో కోర్టు నిర్మించాలని పలువురు న్యాయవాదులు సూచిస్తుండగా.. ఆర్టీసీ అధికారులు అలా వీలుపడదని, బస్సులకు ఆక్యుపెన్సీ రాదని చెప్పినందునే సాహసోపేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలంటున్నారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో నైనా కోర్టు భవనానికి స్థలం కేటాయించాలని పలువురు కోరారు. అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించుకుంటే బీజేపీ నాయకుడు తంగెడ రాజేశ్వర్‌రావు తదితరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ భవనాన్ని రాఘవాపూర్‌ సమీపంలోని గౌరెడ్డిపేట శివారులో నిర్మించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం స్థలం కేటాయించడమే పొరపాటని, రైతులు సాధించిన దిగుబడులు అమ్ముకునేందుకు విశాలమైన స్థలం అవసరమని దాని ఆవరణలో నిర్మించడం సరికా దని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ గ్రహణమా..!

జిల్లా కోర్టు కోసం మొదట ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలోని కన్నాల వద్ద స్థలం కేటాయిస్తే.. అక్కడ ఓ రాజకీయ పార్టీ నేత తన కోసమే ప్రతిపాదించారనే విమర్శలొచ్చాయి. ఆ ప్రాంతంలో క్రషర్లు, క్వారీలు ఉన్నాయని కాలుష్యాన్ని కారణంగా చూపడంతో స్థల కేటాయింపు రద్దయింది. తర్వాత రాఘవాపూర్‌లో సీనియర్‌ న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో స్థల కేటాయింపు జరిగిందని సభ్యుల్లో కొందరు అంటుండగా, తమకు తెలియకుండానే స్థల నిర్ధారణ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. అలాగే, విపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి బస్సు డిపో ఏర్పాటుతో ఇబ్బంది కలుగుతుందని, ఈ కారణంగానే బస్‌డిపో ఏర్పాటయ్యే స్థలంలో కోర్టు నిర్మిస్తే సదరు నేతకు ప్రయోజనంగా ఉంటుందనే చర్చలు సాగుతున్నాయి. కాగా సువిశాల స్థలంలో జిల్లా కోర్టు నిర్మించేందుకు ఏకాభిప్రాయానికి రావడమే మేలు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement