పంచాయతీ షురూ
మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు సందడి సర్పంచ్‌కు 398.. వార్డు మెంబర్‌కు 188 నేడు, రేపు నామినేషన్లకు గడువు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
పల్లె పోరు షురువైంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడితో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులు మొదటి రోజు తమ మద్దతుదారులతో వచ్చి నామినేషన్లు సమర్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో జరిగే 398 సర్పంచ్ స్థానాలకు తొలిరోజు 258 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 3,682 వార్డు స్థానాలకు 188 మంది నామినేషన్లు వేశారు. నేడు, రేపు భారీస్థాయిలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు కావాల్సిన ధ్రువపత్రాలు, ఇంటి, నల్లా పన్నులు చెల్లింపు ప్రతిపాదించే వారిని సమకూర్చుకోవడం వంటి కార్యక్రమాల్లో మరికొంత మంది నిమగ్నమై ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా
కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో పోలింగ్ జరిగే ఐదు మండలాల్లో 92 సర్పంచ్‌స్థానాలకు గానూ 92 నామినేషన్లు, 866 వార్డుమెంబర్ స్థానాలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయి. జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో జరిగే ఆరు మండలాల్లోని 122 సర్పంచ్ స్థానాలకు గానూ 48 నామినేషన్లు, 1172 వార్డు మెంబర్ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో జరిగే ఐదు మండలాల్లో 85 సర్పంచ్‌స్థానాలకు 42 నామినేషన్లు, 748 వార్డు మెంబర్ స్థానాలకు 32నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతలో జరిగే ఐదు మండలాల్లో 99 సర్పంచ్‌స్థానాలకు గానూ 76నామినేషన్లు, 896 వార్డు మెంబర్ స్థానాలకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి పరిశీలకులుగా నియమితులైన అధికారులు క్లస్టర్ గ్రామాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమావేశాలు నిర్వహించి పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
పార్టీ నేతలతో మంతనాలు
సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులతో ప్రమేయం లేకున్నా ఆయా పార్టీల మద్దతు కోసం ఆశావహులు నాయకులతో మంతనాలు మొదలు పెట్టారు. అంగబలం, ఆర్థిక బలం, సామాజిక కోణంతో పరిశీలించి అభ్యర్థులను నియమించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్, బీజేపీలు తమ పార్టీ తరఫున గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధితో బీఆర్‌ఎస్, కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ తమ ప్రచారాన్ని గ్రామాల్లో ముమ్మరం చేసి కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో మొదటి విడత నామినేషన్లు ముగుస్తుండడంతో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీలో ఉంటారనేది తేటతెల్లం కానుంది.
పంచాయతీ షురూ


