‘ఆమె’ చుట్టే రాజకీయం
● పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం ● 50శాతం సీట్ల కేటాయింపుతో.. ● పాలక వర్గాల్లో అతివలకే పెద్దపీట
సాక్షి పెద్దపల్లి: సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం. ఒకట్రెండు ఓట్లతోనే ఫలితాలు తారుమారవుతాయి. దీంతో ప్రతీ ఓటును ఒడిసి పట్టుకునేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో అతివల హవా నడుస్తోంది. హోరాహోరిగా సాగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దాదాపుగా అన్ని గ్రామపంచాయతీల్లో వీరి ఓట్లే అధికంగా ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు శ్రీఆమెశ్రీ ఆశీస్సులపై దృష్టి పెడుతుస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేలా, తమకే ఓటేయాలని విజ్ఞాపనల్ని మహిళా లోకానికి వినిపిస్తున్నారు.
ఆశావహుల ప్రయత్నాలు
పోటీదారుల విజయావకాశాల్ని మార్చగలిగేలా సత్తా మహిళా ఓటర్లకు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు చీరలు, ఇతర బహుమతులను పంచేందుకు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి తదితర మహిళ సంబంధింత పథకాలతో తమకే అతివలు పట్టం కడుతారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తుండగా, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేసిన విషయాన్ని మహిళలకు తెలుపడంతో వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ, మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ తదితర పథకాలను అమలు చేయటం ద్వారా మహిళలకు పెద్దపీట వేశామని బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
పదవుల్లో సగం.. ఓట్లల్లో అధికం
స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 263 పంచాయతీల్లో 121 సర్పంచ్, 2,432 వార్డుల్లో 1,216 వార్డు సభ్యులుగా మహిళలే పోటీ చేయనున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా 4,04,181 ఓటర్లు ఉండగా, అందులో 2,05,439 మంది మహిళలు, 1,98,728 పురుషులు, 14మంది ఇతరులు ఉన్నారు. మొత్తంగా పురుషుల కంటే 6,711మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కాగా మహిళ ఓట్లను గుంపగుత్తగా ప్రసన్నం చేసుకునేందుకు మహిళా సంఘాల వారీగా చీరలు, కుట్టు మిషన్స్, వంట పాత్రలు, టెంట్‌హౌస్ సామగ్రి తదితర నిత్యం ఉపయోగించుకునే వాటిని ఇచ్చేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.


