చితికిపోతున్నారు | - | Sakshi
Sakshi News home page

చితికిపోతున్నారు

Nov 17 2025 9:59 AM | Updated on Nov 17 2025 10:15 AM

● క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు ● తట్టుకోలేకపోతున్న యువత ● పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన

జిల్లా కేంద్రానికి చెందిన విశ్వతేజను కుటుంబ సభ్యులు హాస్టల్‌కు వెళ్లమన్నందుకు నిరాకరించాడు. ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కారణానికే నిండు జీవితాన్ని చాలించి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు.

యైటింక్లయిన్‌కాలనీ భాస్కర్‌రావునగర్‌కు చెందిన బండారి శ్రీనివాస్‌(42) ఈనెల 12న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొయ్యూరులోని ప్రైవేట్‌ ఓబీలో పనిచేస్తున్న శ్రీనివాస్‌ ఆ రోజంతా సంతోషంగా ఉన్నాడు. పెళ్లిరోజు సందర్భంగా భార్యతో కలిసి గుడికి వెళ్లివచ్చి వీధిలో వాళ్లకు స్వీట్లు పంచి పెట్టాడు. భార్య ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తోంది. భార్య, పిల్లలు స్కూల్‌కు వెళ్లిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లోన్‌యాప్‌ వేధింపులతో పెళ్లిరోజునే ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

జీవితం అనేది ఒక వరం. చిన్న కారణాలకే దాన్ని వదిలేయడం సరైన మార్గం కాదు. మనసులో ఎన్ని బాధలు ఉన్నా సమయం అన్నీ తీరుస్తుంది. కష్టం కూడా ఒక రోజు గతమవుతుంది. సృష్టిలో ప్రాణం కంటే పెద్ద సమస్య ఏదీ లేదు దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాంటున్నారు మానసిక నిపుణులు

గోదావరిఖని(రామగుండం): చిన్న సమస్యలకే తనువు చాలిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన యువత క్షణికావేశంలో జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు వచ్చినా తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చదువులో ఇబ్బంది వచ్చినా, పరీక్షలో విఫలమైనా, ప్రేమలో నిరాశ కలిగినా, ఉద్యోగం దొరక్కపోయినా అధైర్యపడి.. ‘చితి’కిపోతున్నారు.

తొందరపాటు నిర్ణయాలు

జీవితమంటే కేవలం విజయాలే కాదు.. పరాజయం, బాధ, నిరాశ కూడా భాగమే.. ప్రతీ కష్టం మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఒకసారి సక్సెస్‌ కావచ్చు, మరోసారి విఫలం కావచ్చు.. జీవన ప్రయాణంలో సర్వసాధరణమైన విషయాలకు ధీర్ఘంగా ఆలోచించకుండా నిండు జీవితాన్ని బలిచేసుకుంటున్నారు. మానసిక సమస్యలు, ఒత్తిడి, భయాలు ఇవన్నీ మనిషి జీవితంలో సహజమే అయినా తనువు చాలించి జీవితంలో ఓడిపోకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఆత్మహత్య అనేది చివరిమార్గంగా ఉండేదని, నేటి తరంలో అది ఒక ఆలోచన లేకుండా తొందరపాటుగా తీసుకునే నిర్ణయంలా మారింది. మనసులోని నిరాశ, ఒత్తిడి, అంచనాలు నెరవేరకపోవడం వంటి కారణాలు యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.

కారణాల కంటే పరిష్కారం ముఖ్యం

ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాల తర్వాతే సంతోషం. ఒక్క క్షణం ఆలోచిస్తే మనం తీసుకునే పెద్ద నిర్ణయాలు మారిపోతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడడం ద్వారా మనసులోని బాధ తగ్గుతుంది. బాధను పంచుకోవడం మూలంగా మనస్సు తేలికగా మారడంతో పాటు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈవిషయంలో యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత

సమాజం కూడా ఇలాంటి ఘటనలపై మౌనంగా ఉండకూడదు. నిరాశ లక్షణాలు కనిపిస్తే వారితో మాట్లాడి ఆదరించడం, ప్రోత్సహించడం మనందరి బాధ్యత. పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలింగ్‌ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

మూడేళ్లలో ఆత్మహత్య ఘటనలు

ఏడాది ఆత్మహత్య చేసుకున్నవారు 2023 2782024 2662025 225

ఒక్క క్షణం ఆలోచించాలి

మానసిక ఆందోళనకు లోనైప్పుడు ఒక్క క్షణం ఓపిగ్గా ఆలోచిస్తే సరైన మార్గం దొరుకుతుంది. ఈవిషయంలో యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం సమాజంపై ఉంది. ఆత్మహత్య విషయం పోలీసుశాఖ దృష్టికి వస్తే వెంటనే పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. ఆత్మహత్యలు సమస్య పరిష్కారానికి మార్గం కాకూడదు. ఈవిషయంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషించాలి. రోజులో అర గంటైనా పిల్లలతో మనసు విప్పి మాట్లాల్సిన అవసరం ఉంది.

– మడత రమేశ్‌, ఏసీపీ, గోదావరిఖని

చితికిపోతున్నారు1
1/1

చితికిపోతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement