డీపీఆర్‌కు ఆమోదం లభించేనా..?
● నూతన విద్యుత్ కేంద్రం డీపీఆర్ సిద్ధం చేసిన జెన్‌కో ● గతేడాది జూన్ 4న మూతపడిన ఆర్‌టీఎస్ బీ స్టేషన్
రామగుండం: రామగుండంలో నూతన విద్యుత్ కేంద్రం స్థాపనపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడనుందా అనే ఉత్కంఠ సర్వత్రా ఆసక్తి నెలకొంది. పట్టణంలోని ఆర్‌టీఎస్–బీ విద్యుత్ కేంద్రానికి చెందిన స్థలంలోనే కొత్తగా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం స్థాపనపై జెన్‌కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసింది. కాగా, గత నెల 22న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాలం చెల్లిన బీ–థర్మల్ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు తొలి ప్రకటన చేసిన మంత్రివర్గం అదే స్థానంలో కోత్త కేంద్రం స్థాపనకు అప్పుడే సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో నూతన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే విద్యు త్ కేంద్రం స్థాపనకు గ్రీన్ సిగ్నల్ పడినట్లవుతుంది.
నూతన కేంద్రం స్థాపనకు..
ఇప్పటికే విద్యుత్‌సౌధ సిద్ధం చేసిన డీపీఆర్‌ను పరిశీలిస్తే.. నూతన కేంద్రం స్థాపనకు మొత్తం ఖర్చు రూ.10,893.05 కోట్లు కాగా, 650 ఎకరాల భూమి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఏటా 3.053 మిలియన్ టన్నుల బొగ్గు, గంటకు 2,365 క్యూబిక్ మీటర్ల నీరు వినియోగం ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా ఇందులో కొంతమేర వ్యయం మూతపడిన విద్యుత్ కేంద్రం వనరుల లభ్యతతో సమకూరనుంది.
ఆర్‌టీఎస్ ఆస్తులు, వనరులు..
విద్యుత్ సౌధ గణాంకాల ప్రకారం బీ–థర్మల్ విద్యుత్, ఉద్యోగుల క్వార్టర్లతో కలిపి భూములు 700.24 ఎకరాలు కాగా ప్రస్తుతం 580.09 ఎకరాలు మాత్రమే క్లియర్‌గా ఉన్నట్లు తెలిసింది. జెన్‌కో భూముల్లో పోలీస్‌స్టేషన్, పోస్టాఫీస్, ఈఎస్‌ఐలో కొంత స్థలం, మున్సిపల్ శాఖ, ఎస్‌టీపీలుండగా, 90 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. బీ–థర్మల్ ఉద్యోగులు మొత్తం 323 మంది కాగా వైటీపీఎస్ బదిలీ వెళ్లినవారిని తొలగిస్తే 225 మంది స్థానికంగా ఉన్నారు.


