ప్రతి రోజూ తిరుపతి రైలు
నిజామాబాద్ నుంచి నడపాలని ప్రతిపాదన
కేంద్ర రైల్వే బోర్డుకు లేఖ రాసిన దక్షిణ మధ్య రైల్వే
కనీసం అదనపు ట్రిప్పులకు నోచుకోని కరీంనగర్– తిరుపతి రైలు
ముగ్గురు ఎంపీలు చొరవ తీసుకోవాలంటున్న ప్రయాణికులు
గడ్డం వంశీ
బండి సంజయ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు త్వరలో దక్షిణమధ్య రైల్వే శుభవార్త తీసుకురానుంది. ప్రస్తుతం తిరుపతి– కరీంనగర్ నగరాల మధ్య నడుస్తున్న ట్రైన్ నంబరు 12761 బైవీక్లీని త్వరలోనే రెగ్యులర్‌గా నడిపేలా అనుమతివ్వాలని కేంద్రానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు ఇటీవల ప్రతిపాదన పంపారు. దీనికి ఎంపీల మద్దతు తోడైతే త్వరలోనే ఉత్తర తెలంగాణవాసులకు తిరుపతికి వెళ్లే సదుపాయం వారం మొత్తం అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతికి వెళ్లాలని అత్యధిక మంది భక్తులు కోరుకుంటారు. అందుకే, గత యూపీఏ హయాంలో బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల నుంచి భక్తులు తిరుపతి వెళ్లేందుకు ఈ రైలుపైనే ఆధారపడుతున్నారు. రోజురోజుకు రద్దీ పెరుగుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చొరవ తీసుకోకపోవడంతో ఈ రైలు సేవలు మొదలై పు ష్కర కాలమైనా ఇంకా బైవీక్లీగానే మిగిలిపోయింది.
నిజామాబాద్ నుంచి ప్రారంభం..
తిరుపతి– కరీంనగర్ ట్రైన్ నంబరు 12761 ప్రతీ గురువారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఇటీవల తిరుపతి– కరీంనగర్ రైలును వారానికి నాలుగుసార్లు నడుపుతామన్న ప్రతిపాదన పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కరీంనగర్ చుట్టుపక్కల జిల్లాల నుంచి తిరుపతికి వెళ్తున్న భక్తుల రద్దీని చూ సి స్వయంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులే స్పందించారు. ఈ రైలును వారంలో ప్రతీరోజూ నడిపేలా అనుమతించాలని కోరుతూ కేంద్ర రైల్వేకు ప్రతిపాదన పంపారు. నిజామాబాద్ నుంచి కరీంనగర్, పెద్దపల్లి మీదుగా తిరుపతికి రైలును నడిపించాలని ప్రతిపాదనలు మార్చారు. తద్వారా నిజామాబాద్, కోరుట్ల, జగిత్యాల వాసులకు తిరుపతికి వెళ్లే అవకాశం దక్కనుంది.
ముగ్గురు ఎంపీలు.. చొరవ ఎవరిదో..
ప్రస్తుతం తిరుపతి– కరీంనగర్ రైలు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంటులో నడుస్తోంది. నిజామాబాద్ వరకు రైలు సేవలను పొడిగించనుండటంతో రైలు సేవలు అదనంగా ఇందూరు పార్లమెంటు సెగ్మెంట్‌లో కూడా రైలు సేవలు అందించనుంది. దీంతో ముగ్గురు ఎంపీల్లో ఎవరో ఒకరు చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చినా.. ఈ పని మరింత త్వరగా అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు పార్లమెంటు ఎంపీలు తిరుపతి–కరీంనగర్ రైలును రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కేంద్రానికి కనీసం లేఖలు రాసినా రైలు రెగ్యులరైజ్ అవుతుందని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ రైల్వే ఉన్నతాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు.
ప్రతి రోజూ తిరుపతి రైలు


