సర్వర్ డౌన్.. కొనుగోళ్లు జాప్యం
పత్తి రైతుల పరేషాన్ అకాల వర్షాలతో ఆగమాగం మరోవైపు సర్వర్ సతాయింపు కొనుగోళ్లలో కొంత జాప్యం పరిస్థితిని చక్కదిద్దిన మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్, కార్యదర్శి
పెద్దపల్లిరూరల్: పత్తిరైతులకు ఖరీఫ్ సీజన్ కలిసి రావడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చేలు తెగుళ్ల బారిన పడడంతో పంట దిగుబడులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలో అన్నదాతలున్నారు. జిల్లావ్యాప్తంగా 48,215 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 5,78,580 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అనూహ్యంగా కురుస్తున్న వానలతో పత్తి రైతులు పరేషాన్ అవుతున్నారు. మంగళవారం కురిసిన వర్షానికి పెద్దగా పత్తి తడవకపోయినా..టార్పాలిన్ల కొరత కనిపించింది.
అమ్మేటప్పుడు ఆగమాగమే
రైతులు తొలివిడతగా తీసిన పత్తి దిగుబడులను అమ్ముకునేందుకు మంగళవారం జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో ఆందోళనకు గురయ్యారు. పత్తి కొంచెం తడవడంతో వ్యాపారులు సంచికి రెండు, మూడు కిలోలు తగ్గిస్తామనడంతో రైతులు వాదనకు దిగారు. మార్కెట్ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, కార్యదర్శి మనోహర్, అడ్తిదారుల సమక్షంలో లచ్చయ్య అనే రైతుకు చెందిన తడిసిన పత్తి సంచిని తూకం వేసి, అంతకు ముందు వేసిన తూకానికి గల వ్యత్యాసాన్ని గుర్తించారు. దాని ఆధారంగా సంచికి ఒక కిలో కోత పెట్టేందుకు అందరూ అంగీకరించడంతో తూకం యథాతథంగా సాగింది. తూకం జరిగిన పత్తి సంచులను వెంటవెంటనే లారీల్లో పంపించి వేసిన రైతుల సమస్యను పరిష్కరించారు.
సర్వర్ డౌన్‌తో జాప్యం
మార్కెట్లో పత్తిని ఈ నామ్ పద్ధతిన కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం సర్వర్‌డౌన్ కావడంతో కొంతసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు జాప్యం కావడంతో ఒక్కసారిగా వర్షం కురిసింది. రైతులు అందుబాటులో ఉన్న టార్పాలిన్లను కప్పగా.. అక్కడక్కడ పత్తి సంచులు తడిసిపోయాయి. అధికారుల తీరే ఇందుకు కారణమని ఆరోపించారు. ఇక ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.


