
ఏడో తరగతి చదివితే చాలు..
కారు, ద్విచక్రవాహనం లైసెన్స్ ఉంటే అర్హులే.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తొలుత నైపుణ్య శిక్షణ ఆ తర్వాత ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో డంపర్ ఆపరేటర్‌గా అవకాశం మహిళా ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం బంపర్ ఆఫర్
గోదావరిఖని: మహిళా కార్మికులకు సింగరేణి యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు భూగర్భ గనులు, డిపార్ట్‌మెంట్లలో పనిచేయాలని ఆదేశించిన సంస్థ.. తాజాగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో ఈపీ ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం కల్పిస్తోంది. సంస్థలో మొత్తం 1,672 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఇందులో కనీసం ఏడో తరగతి వరకు చదివి, మోటార్ సైకిల్, లైట్‌మోటార్ వెహికల్ (ఎల్‌ఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారిని ఈపీ ఆపరేటర్లుగా నియమించేందుకు నిర్ణయించింది. ఈమేరకు జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా సాధికారత దిశగా..
సింగరేణి బొగ్గు గనుల్లో మహిళా సాధికారత దిశగా యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఓసీపీల్లో డంపర్లు, డోజర్లు, షావల్స్‌తోపాటు భారీ యంత్రాలు ఉన్నాయి. వీటిపై ఈపీ ఆపరేటర్లుగా పనిచేయడానికి మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మైనింగ్ రంగంలో మహిళా సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సంస్థలోనే అత్యధిక వేతనాలు ఉండే ఓసీపీ ఈపీ ఆపరేటర్ల అవకాశం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది సంస్థ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం.
ఎంపిక విధానం ఇలా..
సింగరేణిలో జనరల్ అసిస్టెంట్, బదిలీ వర్కర్‌గా పనిచేస్తున్న 35ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళా అభ్యర్థులు ఈపీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి. కనీసం ద్విచక్ర వాహనం లేదా ఫోర్‌వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 2024 ఆగస్టుకు ముందు లైట్‌మోటార్ వెహికల్(ఎల్‌ఎంవీ) లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. నమూన ప్రకారం దరఖాస్తు పూర్తిచేసి ఆయా ఏరియాల్లోని జనరల్ మేనేజర్లకు దరఖాస్తులు అందజేయాలి.
ప్రత్యేక కమిటీ పరిశీలన
దరఖాస్తుల పరిశీలన కమిటీకి జీఎం సీపీపీ కన్వీనర్‌గా ఉంటారు. జీఎం(ఈ అండ్‌ఎం), జీఎం(పర్సనల్), జీఎం(హెచ్‌ఆర్‌డీ), చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో కూడిన కమిటీ దరఖాస్తులు పరిశీలించి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అనంతరం వైద్య పరీక్షలకు పంపిస్తుంది.
సిరిసిల్లలో ప్రత్యేక శిక్షణ..
ఎంపికైన మహిళా అభ్యర్థులు సిరిసిల్లలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్‌లో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో శిక్షణ పొందాలి. నెల రోజులపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ఖాళీలను బట్టి ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందు లో ఉత్తీర్ణులైన వారిని ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ–5 హోదాతో పోస్టింగ్ ఇస్తారు. టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి కూడా ఇదేశిక్షణ కేంద్రంలో నెలరోజులపాటు ఫోర్‌వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణపూర్తయ్యాక ఎల్‌ఎంవీ లైసెన్స్ కోసం పరీక్ష రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎల్‌ఎంవీ పూర్తిఅయిన తర్వాత హెచ్‌ఎంవీ/ హెచ్‌జీవీ శిక్షణ పొందాల్సి ఉంటుంది.
మహిళా ఉద్యోగుల వివరాలు
ఆర్జీ–1 277
ఆర్జీ–2 82
ఆర్జీ–3 88
ఎస్టీపీపీ 11
బెల్లంపల్లి 116
మందమర్రి 254
శ్రీరాంపూర్ 251
కార్పొరేట్ 279
కొత్తగూడెం 81
ఇల్లెందు 68
భూపాలపల్లి 165
మొత్తం 1,672
మంచి అవకాశం
మహిళా ఉద్యోగులకు ఈపీ ఆపరేటర్లుగా అవకాశం కల్పించడం మంచి నిర్ణయం. దీనిద్వారా స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఉన్నత హోదా, మంచి వేతనం పొందవచ్చు. జనరల్ అసిస్టెంట్‌గా కాకుండా ఈపీ ఆపరేటర్‌గా పదోన్నతితోపాటు గౌరవం పనిచేసే అవకాశం ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
– ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి