బోనస్‌ కోసం నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ కోసం నిరీక్షణ

Sep 15 2025 7:55 AM | Updated on Sep 15 2025 7:55 AM

బోనస్

బోనస్‌ కోసం నిరీక్షణ

అన్నదాతలకు తప్పని పడిగాపులు యాసంగి ధాన్యం సేకరణ పూర్తి మూడు నెలలు గడిచినా ఇంకా అందని బకాయిలు నిధులు విడుదల చేయని ప్రభుత్వం అదేబాటలో సీడ్‌ కంపెనీలు, మిల్లర్లు అధికారులు చొరవ చూపాలంటున్న రైతులు

సాక్షి పెద్దపల్లి: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయి సుమారు మూడు నెలలు దాటింది. అయినా, సన్నరకం ధాన్యం తాలూకు బోనస్‌ రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమకాలేదు. ఇదే అదనుగా రైతుల నుంచి సీడ్‌ వడ్లు కొనుగోలు చేసిన పలు కంపెనీలు, మిల్లర్లు సైతం బోనస్‌ చెల్లించడం లేదు. దీంతో చేతిలో డబ్బుల్లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే బస్తాపై రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు కోత పెట్టి అడ్డగోలుగా దోచుకుంటున్న రైస్‌ మిల్లర్ల బారినుంచి తప్పించుకునేందుకు రైతులు సీడ్‌వడ్లు సాగుచేసైనా లబ్ధిపొందుతామనుకుంటే.. ఇక్కడ కూడా మోసానికి గురికాక తప్పడం లేదు. సీడ్‌ సాగు చేసిన రైతులకు బోనస్‌ చెల్లిస్తామని మూడు నెలల క్రితమే సన్నవడ్లు సేకరించిన మిల్లర్లు.. ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాభం సీడ్‌ మిల్లర్లకే.

సాధారణంగా రైతుల నుంచి సేకరించిన సన్నరకం ధాన్యాన్ని శుద్ధి చేసి 25 కిలోల చొప్పున బ్యాగుల్లో నింపి బస్తాకు కొంత లాభం చూసుకొని వ్యాపారు లు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. గతేడాది 25 కిలోల విత్తన సంచిని లోకల్‌ మార్కెట్లో రూ.900 నుంచి రూ.950 ధరతో విక్రయించగా ఇతర రాష్ట్రాలకు రూ.1,249 ధర ముద్రించి విక్రయించారు. గతేడాది ప్రభుత్వం బోనస్‌ ప్రకటించలేదు. ఈ ఏడాది బోనస్‌ ప్రకటించింది. దీంతో రైతులు సీడ్‌ మిల్లు యజమానులతో ప్రభుత్వం ఇస్తున్నట్లు బోనస్‌ ఇవ్వాలని, క్వింటాల్‌కు రూ.2,820 చెల్లిస్తేనే ధాన్యం విక్రయిస్తామని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రైస్‌మిల్లు యజమానులు ధర పెంచారు. వ్యాపారులకు 25 కిలోల విత్తన సంచికి ధర పెంచి రూ.1,050 నుంచి రూ.1,100 వరకు విక్రయించారు. అంటే.. క్వింటాల్‌కు రూ.600 లాభంతో అమ్మకాలు సాగిస్తున్నారు. కానీ, రైతులకు ఇచ్చే బోనస్‌ మాత్రం చెల్లించడం లేదు.

ఎగవేతకు యత్నం..

ముందుగా క్వింటాల్‌కు రూ.2,820 ధర ఇస్తానని చెప్పి ఇప్పుడేమో తగ్గించి ఇస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేస్తుండగా.. మరోవైపు బోనస్‌ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. క్వింటాల్‌కు రూ.2,820కి బదులు రూ.2,500 మాత్రమే ఇస్తామని అంటున్నారని, మరికొందరు మద్దతు ధర రూ.2,320 ఇస్తామంటున్నారని పేర్కొంటున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో సీడ్‌ వరి సాగవుతోంది. ఇక్కడ పండిన సన్నవడ్ల విత్తనాలకు నాణ్యతపరంగా ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఏటా ఇక్కడి సీడ్‌మిల్లు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం సేకరించి, మిల్లుల్లో శుద్ధి చేసి విత్తనాలుగా విక్రయిస్తుంటారు. ఈఏడాది యాసంగిలోనూ సాగు చేసిన వరిలో సగానికిపైగా విత్తనాల కోసం ధాన్యం సేకరించారు. అయితే, ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో మద్దతు ధర రూ.2,320కు బోనస్‌ కలిపి రూ.2,820 ఇస్తామని చెప్పి సుమారు 5 వేల మంది రైతుల నుంచి దాదాపు 40 వేల టన్నుల వరకు ధాన్యం తీసుకున్నారు. డబ్బులు అత్యవసరం ఉన్న కొందరు రైతులకు క్వింటాల్‌కు రూ.2,500 చొప్పున చెల్లించగా.. మిగతా రైతులకు ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. జిల్లా యంత్రాంగం చొరవ చూపితేనే తమకు న్యాయం జరుగుతుందని పలువురు అన్నదాతలు వేడుకుంటున్నారు.

జిల్లా సమాచారం..

ధాన్యం కొనుగోలు కేంద్రాలు 315

సన్నధాన్యం విక్రయించిన రైతులు 77,761

జమకావాల్సిన బోనస్‌(రూ.కోట్లలో) 39.8

సీడ్‌ సాగు చేసిన రైతులు(సుమారు) 5,000

మిలర్లకు విక్రయించిన ధాన్యం 40,000 (మెట్రిక్‌ టన్నుల్లో)

బోనస్‌ కోసం నిరీక్షణ 1
1/1

బోనస్‌ కోసం నిరీక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement