
మహిళల ఆరోగ్యంపై దృష్టి
సుల్తానాబాద్(పెద్దపల్లి): మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం మహిళలకు శాపంగా మారుతోంది. ఈ విషయం తెలియక చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ప్రాణాంత వ్యాధులతో సతమతమవుతున్నారు. సకాలంలో, సరైన వైద్యం అందక చాలామంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్రప్రభుత్వం స్వస్థ్ నారీ శక్త్ పరివార్ అభియాన్ పథకం ప్రవేశ పెట్టింది. దీనిద్వారా మహిళలకు అన్నిరకాల వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేకవైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించింది.
జిల్లా మహిళలు 2,22,580 మంది
జిల్లాలో 30ఏళ్ల వయసు పైబడిన మహిళలు 2,22,250 మంది ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, 18 ప్రాథమిక ఆరోగ్య, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సుల్తానాబాద్, మంథని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు.
గురుకులాల్లో బాలికలకు కూడా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని బాలికలకూ ప్రత్యేక వైద్యశిబిరాల ద్వారా వైద్య పరీక్షలు చేస్తారు. ఇందులో మహిళలతోపాటు బాలికలకూ బీపీ, షుగర్, బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లు, అనీమియా, టీబీ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇందుకోసం గైనకాలజిస్ట్, కంటివైద్య నిపుణులు, డేర్మటాలజిస్ట్, డెంటల్ సర్జన్ నిపుణులు ఉంటారు.