
స్ట్రక్చర్ సమావేశం బహిష్కరణ
గోదావరిఖని: గుర్తింపు కార్మిక సంఘంతో చేసుకున్న ఒప్పందాలను సింగరేణి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించినట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈవిషయాన్ని ప్రకటించారు. కార్మికుల సొంతింటి పథకంపై కమిటీ ముందుకు సాగలేదని, వాస్తవ లాభాలు ప్రకటించి అందు 35శాతం వాటా ఇవ్వాలని, నూతన ట్రాన్స్‌ఫర్ పాలసీ రద్దు చేయాలని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. డిస్మిస్ కార్మికులకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరగా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని, అన్ని క్యాడర్ స్కీంలను పరిష్కరించాలని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మారుపేర్ల సమస్య కూడా ఇప్పటికీ కొలిక్కి రాలేదన్నారు. అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయం రావాలని పేర్కొంటూ కాలయా పన చేస్తున్నారన్నారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న, తిరస్కరించిన డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ 2024 సర్క్యూలర్ ప్రకారం అందరికీ ఉద్యో గాలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలను ఇవ్వాలని, అర్హత కలిగిన ఓవర్‌మెన్‌లకు ప్రమోషన్ ఇవ్వాలని, మైనింగ్/ట్రేడ్స్‌మెన్‌ల సూటబుల్ జాబ్ విషయంపై నిర్ణయం తీసుకోవడం లేదని అన్నారు. క్లరికల్ ఖాళీలు భర్తీలో జాప్యం చేస్తోందన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకుంటే సంస్థవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, నాయకులు మిరియాల రంగయ్య, కె.సారయ్య, వైవీరావు. కె.వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, మడ్డి ఎల్లాగౌడ్, వంగ వెంకట్, మోటపలుకుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.