
పాఠశాలల నిర్వహణకు నిధులు
కరీంనగర్: ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధులు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలతో పాటు కస్తూరిబాగాంధీ విద్యాలయాలు, గిరిజన సంక్షేమ పాఠశాలలకు కంపోజిట్ స్కూల్ గ్రాంట్, స్పోర్ట్స్ గ్రాంట్ మంజూరు చేశారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, స్వచ్ఛత, ఇతరత్రా పనులకు నిధులు వినియోగించుకునేందుకు అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లో త్వరలో జమకానున్నాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా అమ్మ ఆదర్శ కమిటీ తీర్మానంతో ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు నిధులను సద్వినియోగం చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్(యూసీ)లను సమర్పించాలి. నిధుల వినియోగంపై ఆడిట్ ఉంటుంది.
ఇలా ఖర్చు పెట్టాలి
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు సంయుక్తంగా వారి పేరున ఉన్న జాయింట్ ఖాతాలో నిధులు జమవుతాయి. కమిటీ తీర్మానం మేరకు చాక్‌పీస్‌లు, తెల్లకాగితాలు, రిజిస్టర్లు తదితర స్టేషనరీ సామగ్రి, పరీక్షల నిర్వహణ, జాతీయ పండగల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, కేయాన్, టీవీ మరమ్మతులు, కొనుగోలు, కేబుల్, ఇంటర్నెట్ చార్జీలు, డిజిటల్ తరగతుల నిర్వహణ ఖర్చులు, ప్రయోగశాలల పరికరాల కొనుగోలు, పాఠశాల భవనాల చిన్నచిన్న మరమ్మతులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల్లో 10 శాతం పాఠశాల ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమానికి విధిగా ఖర్చు చేయాలన్న నిబంధన ఉంది.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ నిమిత్తం విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన ఈ నిధులు విడుదల చేస్తారు. గతంలో ఎన్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు వేర్వేరుగా వచ్చేవి. ఈ రెండింటినీ కలిపి సమగ్రశిక్షగా మార్చి విలీనం చేశారు. సమగ్ర శిక్ష నుంచే నిధులు కేటాయిస్తున్నారు. 1–30 మంది విద్యార్థులుంటే రూ.10 వేలు, 31–100 మందికి రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మందికి రూ.75 వేలు, వెయ్యికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.లక్ష నిధులు మంజూరు చేశారు. వీటిలో తొలివిడతగా 50 శాతం నిధులు విడుదల చేస్తూ అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యేలా చర్యలు చేపట్టారు. కాగా, కొన్ని నెలలుగా పాఠశాలల ఆవరణ శుభ్రం చేయించడం, శానిటైజేషన్, ఇతర వాటికి గతంలో ఇచ్చిన నిధులు సరిపోక కొందరు ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేశారు. ఎట్టకేలకు స్కూల్ గ్రాంట్ నిర్వహణ నిధులు విడుదల కావడంతో ప్రధానోపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుంది.
కనీస వసతుల కల్పన, స్వచ్ఛతపై దృష్టి
అమ్మ ఆదర్శ కమిటీ తీర్మానాలతో వినియోగం
ఉమ్మడి జిల్లాకు రూ.5.32 కోట్లు
జిల్లాల వారీగా విడుదలైన నిధులు
జిల్లా పాఠశాలలు నిధులు
కరీంనగర్ 542 1,25,95,000
జగిత్యాల 677 1,81,75,000
పెద్దపల్లి 450 1,03,01000
రాజన్నసిరిసిల్ల 446 1,22,02000
మొత్తం 2,115 5,32,73,000