
బోయినపల్లి కేజీబీవీలో ఏసీబీ తనిఖీలు
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి కేజీవీబీలో బుధవారం ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4:20 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. లీగల్ మెట్రాలజీ, శానిటరీ, ఫుడ్, ఆడిటర్ అధికారులు అధికారులు పాల్గొన్నారు. కేజీబీవీలో ఆహార నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, టీచింగ్, నాన్ టీచింగ్ రికార్డులు తనిఖీ చేశారు. వంటగది అపరిశుభ్రంగా ఉండడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ సరిగా లేదని, పాఠశాల క్యాష్ బుక్ ఎంట్రీలను అప్‌డేట్ చేయలేదని గుర్తించారు. కొన్ని అనవసర కొనుగోళ్లు చేయడంతో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కాగా బోయినపల్లి కేజీబీలో అవకతవకలు జరుగుతున్నాయని, అమ్మ ఆదర్శ కమిటీ నిధులు గోల్‌మాల్ చేశారని ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. పలు టెండర్లను కేజీబీవీలో పనిచేసే ఉద్యోగుల బంధువులకే ఇచ్చారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏసీబీ అధికారులు ప్రకటనలో తెలిపారు.