
గోదావరి పుష్కరాలకు కార్యాచరణ
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు వచ్చే ప్రదేశాలను గుర్తించి స్నానఘాట్‌ల నిర్మా ణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సుందిళ్ల, గోదావరిఖని సమ్మక్క, సారలమ్మ, మంథనిలోని గౌతమేశ్వర ఆలయం, గోయిల్‌వాడ ప్రాంతాలకు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశముందన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల పనితీరు సరిగ్గాలేదని, పనితీరు మెరుగుపర్చుకోకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా చేస్తే ఉండాలని, లేదంటే సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నరేందర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, ఆర్డీవో గంగయ్య, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, జిల్లా సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్‌రావు, సీడీపీవోలు అలేఖ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మల్లికార్జునస్వామి
ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఆయన ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదులు నిర్మిస్తామన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, ఓదెల నుంచి పెగడపల్లి గ్రామం వరకు తారురోడ్డు నిర్మిస్తామన్నారు. మల్లన్న గుడికి ఫోర్‌లేన్‌తోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆలయ ఏసీ సుప్రీయ, టెంపుల్ చైర్మన్ చీకట్ల మొండయ్య, ప్రతినిధులు ఆళ్ల సుమన్‌రెడ్డి, తిరుపతి, ధీరజ్‌కుమార్ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు వీరభద్రయ్య ఆధ్వర్యంలో కలెక్టర్, ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.
అందుబాటులో యూరియా
రైతులకు యూరియా అందుబాటులో ఉందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కొలనూర్‌లో యూరియా గోదామును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, నాయకులు మూల ప్రేంసాగర్‌రెడ్డి, గోలి అంజిరెడ్డి, బైరి రవిగౌడ్, బొంగోని రాజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.