
అర్ధాకలితో చదువుకునేదెలా?
● జూనియర్ కాలేజీల్లో అమలుకు నోచుకోని ‘మధ్యాహ్న భోజనం’
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పేద, మధ్య తర గతికి చెందినవారే ఉంటారు. వీరు మారుమూల ప్రాంతాల నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వా రా కళాశాలలకు చేరుకుంటున్నారు. చదువుపై ఆసక్తితో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆకలి బాధలు తప్ప డం లేదు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూ ళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంకా అందుబాటులో తేవడం లేదు. వీరికోసం ప్రభుత్వం గతేడాది ఇచ్చిన హామీని అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
14 కళాశాలలు.. 3,286 మంది విద్యార్థులు
జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. అందులో 3,286 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి చదువు పూర్తయ్యాక ఇళ్లకు వెళ్తుంటారు. ఉదయం ఎనిమిది గంటలకు గ్రామీణ ప్రాంతాల్లోని తమ ఇళ్ల నుంచి బయలు దే రే విద్యార్థులు.. ఉదయం తొమ్మిది గంటలకు ఆర్టీసీ బస్సుల్లో కాలేజీలకు చేరుకుంటున్నారు. అప్పటికే ఫస్ట్‌పీరియడ్ ముగుస్తోంది. దీంతో విద్యార్థులు అంతకన్నా ముందుగానే తయారై కాలేజీ బాటపట్టడంతో ఇంటివద్ద భోజనం కానీ, అల్పాహారం కానీ చేసే అవకాశం ఉండడంలేదు. సాయంత్రం కాలేజీ ముగిశాక సకాలంలో బస్సులు రాక రాత్రి ఏడు గంటల వరకు ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో చాలామంది మధ్యాహ్న భోజన తినక ఖాళీకడుపుతోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు బిస్కెట్లు, స్నాక్స్‌తో ఆకలి తీర్చుకుంటున్నారు. టిఫిన్ బాక్స్ తెచ్చుకునే కొందరు స్నేహితులతో పంచుకొని తింటున్నారు. అర్ధాకలితో బాధపడే విద్యార్థుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని న్యూట్రిషన్లు చెబుతున్నారు. ఆకలి తట్టుకోలేక కొందరు ఇంటికి వెళ్లి పోతే.. ఏకాగ్రత దెబ్బతింటుందని అధ్యాపకులు వివరిస్తున్నారు.