
సింగరేణిలో మహిళాగార్డులు
● యువతులను నియమించే అవకాశం ● తొలిదశలో 150 మంది ఎంపిక ● త్వరలోనే నోటిఫికేషన్ జారీ
గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం మళ్లీ మహిళా సెక్యూరిటీ గార్డుల నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. సంస్థలో ప్రస్తుతం సుమారు 2వేల మందికిపైగా మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ జనరల్ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పగించింది. చదువుతో నిమిత్తం లేకుండా వీరు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా వర్క్‌షాప్‌లు, జీఎం కార్యాలయాలు, భూగర్భ గనులు, స్టోర్స్, డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్నారు. తాజాగా 150 మంది మహిళా కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిపై నోట్‌ఫైల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి సంస్థ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆసక్తిగల మహిళలను ఎంపికచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐదేళ్ల క్రితం వరకు సెక్యూరిటీ గార్డులుగా..
ఐదేళ్లక్రితం వరకు మహిళలు సెక్యూరిటీ విభాగంలో పనిచేశారు. అయితే ఉద్యోగవిరమణ పొందడంతో వారిస్థానంలో కొత్తవారిని నియమించలేదు. గతంలో ఉద్యోగం చేస్తూ మరణించిన కార్మికుడి భార్య, వారి కుటుంబంలోని మహిళలకు సింగరేణి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ కొనసాగింది. వీరిని తొలుత గుట్కా(క్లెఫిల్)షెడ్లలో నియమించింది. ఆ తర్వాత జనరల్ మజ్దూర్లుగా విధులు అప్పగించింది. క్లెఫిల్ షెడ్లు ఎత్తివేయడంతో అందులో పనిచేస్తున్న మహిళా కార్మికులను సెక్యూరిటీ విభాగంలోకి తీసుకుంది. ఇలా ప్రతీ ఏరియాలో ఐదు నుంచి పది మంది వరకు మహిళలు సెక్యూరిటీ విభాగంలో కొనసాగారు. ప్రస్తుతం మహిళా కార్మికుల్లో కొందరిని సెక్యూరిటీ గార్డులుగా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.