ఆగ్రహించి రోడ్డెక్కారు.. | - | Sakshi
Sakshi News home page

ఆగ్రహించి రోడ్డెక్కారు..

Sep 10 2025 10:02 AM | Updated on Sep 10 2025 10:20 AM

రసీదులిచ్చిండ్రు.. యూరియా ఇయ్యరట..

అన్నదాతల ఆగ్రహం .. గ్రోమోర్‌ సెంటర్‌ ఎదుట ఆందోళన

పెద్దపల్లిలో రాజీవ్‌ రహదారిపై రైతుల నిరసన

సుల్తానాబాద్‌లో బారులు తీరిన రైతులు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో యూరియా లొల్లి ఇంకా ముదురుతూనే ఉంది. రైతులు తమకు అవసరమైన యూరియా కోసం గోదాములు, ఆగ్రోస్‌, గ్రోమోర్‌, సహకార సంఘాల ఎదుట బారులు తీరుతూనే ఉన్నారు. వరి పంటకు ఇప్పుడు యూరియా చల్లాల్సిన సమయమొచ్చిందని మొత్తుకుంటున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ మన గ్రోమోర్‌ కేంద్రం వద్ద రాఘవాపూర్‌, రంగాపూర్‌, గౌరెడ్డిపేట తదితర గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ఉదయమే బారులు తీరారు. నిల్వను బట్టి నిర్వాహకులు వారికి రసీదులు ఇచ్చారు. అయితే, రేపు వస్తే యూరియా ఇస్తామని సిబ్బంది చెప్పడంతో కంగుతిని వారితో వాగ్వాదానికి దిగారు.

సిబ్బంది నిలదీత..

యూరియా కోసం రసీదులు ఇచ్చి తీరా రేపు రావా లని ఎందుకు చెబుతున్నారని రైతులు సిబ్బందిని నిలదీశారు. వెంటనే ఇవ్వాలనే డిమాండ్‌తో రాజీవ్‌రోడ్డెక్కారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సీపీఎం మండల అధ్యక్షుడు కల్లెపల్లి అశో క్‌, నాయకులు ప్రశాంత్‌, సందీప్‌, శ్రావణ్‌, సురేశ్‌ తదితరులు రైతులకు మద్దతుగా నిలిచారు. ఎస్సై లు లక్ష్మణ్‌రావు, మల్లేశ్‌ సిబ్బంది రైతులకు నచ్చ జెప్పారు. నిర్వాహకులతో మాట్లాడి యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్‌లో..

జూలపల్ల/ఎలిగేడు/సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ఎలి గేడు మండలం ధూళికట్ట సహకార సంఘం పరిధిలోలని ముప్పిరితోటలో ఒక్కో రైతుకు ఒక్కో యూరియా సంచి చొప్పున 200 బస్తాలు పంపిణీ చేసినట్లు ఏఈవో శరణ్య తెలిపారు. ధూళికట్టలో గంటల తరబడి వేచిచూసినా యూరియా లోడ్‌రాక రైతులు నిరాశతో వెనుదిరిగారు. సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దుకాణం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా లోడ్‌ వచ్చిందని స మాచారంతో రైతులు భారీగా తరలివచ్చి బారులు తీరారు. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా ఒక్కో రైతుకు ఒకట్రెండు యూరియా బస్తాలు ఇవ్వడంతో రానివారు నిరాశతో వెనుదిరిగారు. జూలపల్లిలో మహిళా రైతులు యూరియా లారీని అడ్డుకుని నిరసన తెలిపారు.

నేటి నుంచి రైతుల వద్దకే..

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): జిల్లాలోని 25 రైతువేదికల ద్వారా బుధవారం నుంచి యూరియా పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో 54 రైతులు వేదికలు ఉండగా.. ఇందులో 25 వేదికల ద్వారా పంపిణీ చేస్తామని, ఇందుకోసం పీఏసీఎస్‌ ఉద్యోగులకు ఈ పాస్‌ యంత్రాలు అందజేశామన్నారు. పంపిణీపై వారికి శిక్షణ కూడా ఇచ్చామని వివరించారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు వెయ్యి టన్నుల యూరియా వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఆగ్రహించి రోడ్డెక్కారు..1
1/1

ఆగ్రహించి రోడ్డెక్కారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement