
యూరియాపై విపక్షాలది విషప్రచారం
పెద్దపల్లిరూరల్: యూరియా సరఫరా సక్రమంగానే సాగుతున్నా విపక్ష పార్టీల నాయకులు విషప్రచారం చేస్తూ రైతుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తదితరులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. యూరియా నిల్వలు, సరఫరా తదితర అంశాలపై చర్చించారు. రైతులకు ఇబ్బందులు రాకుండా యూరియా అందిస్తామన్నారు. పెద్దపల్లిలోని డీలర్ల వద్ద ఉన్న నిల్వలపై ఆరా తీశారు. కొందరు రైతులు అవసరానికి మించి యూరియా తీసుకెళ్లి ఇంట్లోనిల్వ చేసుకోవడం కూడా కొరతకు మరో కారణమని అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిల్వలు చేరలేదని, అయినా ఇబ్బందులు రాకుండా చూడగలిగామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. యూరియా సరఫరా విషయమై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈప్రాంత అవసరాల కోసం యూరియా సరఫరా జరిగేలా చూడాలని కోరగా, మంత్రి సానుకూలంగ స్పందించారని ఎమ్మెల్యే వివరించారు.