
రాష్ట్ర ఉత్తమ లెక్చరర్‌గా శ్రీవాణి
ఎలిగేడు(పెద్దపల్లి): శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం అధిపతిగా, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కోడూరి శ్రీవాణి 2025 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయింది. ఎలిగేడు మండలకేంద్రానికి చెందిన శ్రీవాణిది నిరుపేద చేనేత కుటుంబం. తల్లి బీడీ కార్మికురాలు. శ్రీవాణి చదువుకుంటూనే తల్లికి చేదోడువాదోడుగా బీడీలు చుడుతూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. తన విద్యాప్రయాణమంతా ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జెడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో, సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల కరీంనగర్‌లో ఇంటర్‌లో మొదటిర్యాంకు, కరీంనగర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో బీఏలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు, ఎంఏ ఎకానమిక్స్‌లో మొదటి ర్యాంకుతో పాటు మూడు బంగారు పతకాలు, కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ, ఎంఈడీలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఒకే సంవత్సరంలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాగా, గ్రామీణప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక కారణాలతో చాలామంది మట్టిలో మాణిక్యాలు బయటి ప్రపంచానికి రాలేకపోతున్నారని, అలాంటి వారి సామర్థ్యాలను గుర్తించి విద్యాపరిశోధనా రంగంలో తీర్చిదిద్దుతానని శ్రీవాణి పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి అహర్నిషలు కృషిచేస్తానని తెలిపారు.