
తప్పని యూరియా తిప్పలు
పొత్కపల్లి, ముత్తారం ప్యాక్స్‌ల ఎదుట బారులు గంటల తరబడి నిరీక్షించినా అందని యూరియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
ముత్తారం(మంథని): జిల్లాలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. సింగిల్‌విండోలకు యూరియా లోడ్ వచ్చిందని సమాచారం అందితే చాలు.. అన్నిపనులూ పక్కన పెట్టేసి, నిద్రాహారాలు మానేసి కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ గంటల కొద్దీ నిరీక్షిస్తున్నా.. చివరలో ఉన్నవారికి నిరాశే ఎదురవుతోంది. ఈ క్రమంలోనే ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ఉదయం గంటల తరబడి నిరీక్షించారు. వచ్చిన 170 బస్తాల యూరియా మధ్యాహ్నం వరకే అయిపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగి పోవడం కలకలం రేపుతోంది.
పొత్కపల్లి విండో ఎదుట..
ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. కొలనూర్, హరిపురం, గోపరపల్లె, రూపునారాయణపేట, గుంపుల, గూడెం గ్రామాలకు చెందిన సుమారు 400మంది రైతులు ఉదయమే ప్యాక్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒకేసారి వందల సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. రంగ ప్రవేశంచేసిన పోలీసులు.. బందోబస్తు మధ్య .. రైతుల ఆధార్‌కార్డుల ఆధారంగా అధికారులు యూరియా పంపిణీ చేశారు.

తప్పని యూరియా తిప్పలు