
ప్రాదేశికం.. తర్వాతే పంచాయతీ
సాక్షి పెద్దపల్లి:
పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్పంచ్ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు తుదిజాబితాను జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓటరు ముసాయి దా జాబితాకు షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల పాలన గతేడాది జనవరిలో ముగిసింది. అదేవిధంగా జిల్లా, మండల ప్రజా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం గత జూలైలోనే ముగిసింది. దీంతో స్థానిక పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లింది. ఈనెలాఖరులో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వీటిపైనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు
ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే పీవోలు, ఏపీవోలు, రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తికాగా, వారికి శిక్షణ కూడా ముగిసింది. బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రి జిల్లాకు ఇప్పటికే వచ్చి చేరింది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారని అంటున్నారు.
263 పంచాయతీలు .. 4,04,181 మంది ఓటర్లు
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గత జనవరిలో రూపొందించిన ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి, ఇప్పటికే ఓటర్లు, పోలింగ్ జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులపై ప్రదర్శించారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుదిజాబితా విడుదల చేశారు. దీని ఆధారంరంగా జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లో 2,432 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం..
ఈసీ ఆదేశాల మేరకు ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ కు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నెల 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటరు ముసాయిదా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించనున్నారు. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, అదేరోజు కలెక్టర్ అధ్యక్షతన ఎంపీడీవోలు, రాజకీయ పార్టీల ప్ర తినిధులతో సమావేశమై ముసాయిదా జాబితాపై చర్చిస్తాన్నారు. 10న తుది జాబితా ప్రకటిస్తారు. ఎంపీటీసీ పోలింగ్‌కు గులాబీ, జెడ్పీటీసీ పోలింగ్ కోసం తెల్లబ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నారు.
తుది ఓటరు జాబితా ఇలా..
మండలం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం
అంతర్గాం 8,807 9,122 1 17,930
ధర్మారం 21,483 22,210 4 43,697
ఎలిగేడు 9,088 9,481 1 18,570
జూలపల్లి 11,977 12,186 0 24,163
కమాన్‌పూర్ 9,875 10,270 0 20,145
మంథని 17,040 17,929 4 34,973
ముత్తారం 11,328 11,868 1 23,197
ఓదెల 17,588 18,219 0 35,807
పాలకుర్తి 13,934 14,184 0 28,118
పెద్దపల్లి 24,989 25,996 1 50,986
రామగిరి 16,167 16,406 1 32,574
శ్రీరాంపూర్ 17,225 17,595 1 34,821
సుల్తానాబాద్ 19,227 19,973 0 39,200
10 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల!
గ్రామ పంచాయతీల ఓటరు జాబితా విడుదలైనా.. ప్రభుత్వం తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుంది. అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతుంది. దీంతో ఈనెల 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశం ఇంకా తేలకపోయినా.. బరిలో నిలిచేందుకు ఆశావాహులు, పార్టీలు సన్నద్ధం అవుతుండటంతో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది.
జిల్లా సమాచారం
పంచాయతీలు 263
వార్డులు 2,432
ఎంపీటీసీ 137
జెడ్పీటీసీ 13
పురుష ఓటర్లు 1,98,728
మహిళా ఓటర్లు 2,05,439
ఇతరులు 14