
తల్లిపాలకు మించిన పౌష్టికాహారం లేదు
● డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి ● మెడికో, నర్సింగ్ స్టూడెంట్లతో అవగాహన ర్యాలీ
కోల్‌సిటీ(రామగుండం): తల్లిపాలు పిల్లలకు వరమని, తల్లిపాలకు మించిన పౌష్టికాహారం బిడ్డకు ప్రపంచంలో ఎక్కడా లభించదని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం సిమ్స్, నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు నగరంలోని కాలేజీలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలేజీ నుంచి మున్సిపల్ టీ జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో, సిమ్స్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఆరు నెలల వయసు వచ్చేవరకూ బిడ్డకు కచ్చితంగా తల్లిపాలే తాగించాలని సూచించారు. కొందరు తల్లిదండ్రులు రసాయన మిశ్రమాలతో తయారు చేసిన కృత్రిమ పాలు తాగించి పిల్లల ఆరోగ్యాన్ని చేజేతుల్లా పాడుచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు తాగించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు అరుణ, అశోక్, శిరీష తదితరులు పాల్గొన్నారు.